తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది.
రాష్ట్రసాధనలో కేసీఆర్ కి సమానంగా తన పోరాట పటిమతో తెలంగాణ ప్రజలను, ఓయు విద్యార్ధులని ఉద్యమంలో భాగస్వాములని చేసిన తెలంగాణ జేఏసీ ప్రొఫెసర్ కోందండ రాం నేతృత్వంలో కొత్తపార్టీ ఏర్పాటైంది. హైదరాబాదులోని హోటల్ సెంట్రల్ కోర్టులో తాను స్థాపించిన కొత్త పార్టీ పేరును ‘తెలంగాణ జన సమితి’ పార్టీ గా కోదండరామ్ ప్రకటించారు.
ఇప్పటికే తెలంగాణ జన సమితి పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోద ముద్ర వేసింది. పార్టీ పేరు ప్రకటించిన అనంతరం కోదండరామ్ పార్టీ కి సంబంధించిన కొన్ని విషయాలని వెల్లడించారు, ఈ నెల 29వ తేదీన హైదరాబాదులో భారీ ఎత్తున తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభను నిర్వహిస్తామని, సభ నిర్వహణ కోసం సన్నాహక కమిటీలను వేశామని తెలిపారు. అలాగే ఈ నెల 4 వ తేదీన పార్టీ జెండాను ఆవిష్కరిస్తామని చెప్పారు. జెండాకు సంబంధించి పలువురి సూచనలు తీసుకున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమం దేనికోసం జరిగిందో… ప్రస్తుత ప్రభుత్వ పాలనలో తెలంగాణా వచ్చినా ఆ అవి అమలు కావడం లేదని, అసలు తెలంగాణా లోనే ప్రజాస్వామిక విలువలకు గౌరవం లేకుండా పోయిందని మండిపడ్డారు. అసలు మంత్రులకు సంబంధం లేకుండానే కేసీఆర్ ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈ ఒంటెద్దు పోకడల కోసమేనా మనం ఇంత కష్ట పడి తెలంగానా సాధించుకుంది అని కోదండరామ్ ప్రశ్నించారు.