ఎంఎస్ ధోని విజయవంతమైన కెప్టెన్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీమిండియాకు కెప్టెన్‌గా అనితరసాధ్యమైన రికార్డులు సాధించిన ధోని 2007 టీ20, 2011 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోపీలు గెలిచిన ఒక ఒకే కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక ఐపీఎల్లో ఆరంభం నుంచి చెన్నై కెప్టెన్‌గా ఉన్న ధోని ఆ జట్టును విజయపథంలో నడిపించాడు. ధోని చెన్నై కెప్టెన్‌గా మూడు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను సాధించిపెట్టాడు. ఈ సందర్భంగా సీఎస్కే కెప్టెన్‌గా ధోనీ అరుదైన ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్‌పై విజయంతో ధోని కొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ 100 విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక కెప్టెన్ ధోనీనే కావడం విశేషం.
2019 ప్రపంచకప్ తర్వాత దాదాపు 437 రోజలు పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోని నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ద్వారా గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఇన్ని రోజుల విరామం తర్వాత కూడా తన కూల్ కెప్టెన్సీ ఎలా ఉంటుందో అభిమానులకు చూపించాడు. ఆగస్టు 15 సాయంత్రం 7.29 గంటలకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. సెప్టెంబర్ 19న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సాయంత్రం 7.30గంటలకు తిరిగి గ్రౌండ్లోకి అడుగుపెట్టడం యాదృశ్చికం అని చెప్పవచ్చు. అయితే ఐపీఎల్ టోర్నీలో కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీకి ఇది 105వ విజయం. చెన్నైపై నిషేధం కారణంగా 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా 5 విజయాలు అందించాడు. ఇక కెప్టెన్‌గా మహీ 175 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం. 175 మ్యాచ్‌లలో 105 విజయాలు, 69 ఓటములు ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సౌరభ్ తివారి (31 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. క్వింటన్ డి కాక్ (20 బంతుల్లో 33; 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. చెన్నై బౌలర్లలో ఇన్‌గిడి 3 వికెట్లు పడగొట్టగా… దీపక్ చహర్, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అంబటి తిరుపతి రాయుడు (48 బంతుల్లో 71; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫాఫ్ డు ప్లెసిస్ (44 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 85 బంతుల్లో 115 పరుగులు జోడించారు.