భక్తులు సమర్పించే హుండీ కానుకలే టీటీడీకి ప్రధాన ఆదాయం. వాటి లెక్కింపు కోసం టీటీడీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. శ్రీవారి ఆలయంలోనే పరకామణి మండపంలో నిత్యం స్వామివారి హుండీ కానుకలు లెక్కిస్తారు. కాకనీ టీటీడీ అనాలోచిత నిర్ణయాలతో.. ఇప్పుడు సిబ్బంది కొరత ఏర్పడుతోంది.
దీంతో లెక్కింపు జరగక నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో వడ్డీ రూపేణా రావల్సిన ఆదాయాన్ని కోల్పోతోంది టీటీడీ. శ్రీవారికి మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా కానుకలు హుండిలో సమర్పిస్తారు భక్తులు. కానుకలలో నగదే కాదు బంగారం, వజ్రాలు, విదేశి కరెన్సీ, వస్తువులు, పదార్ధాలు ఇలా అనేక రకాలుగా వుంటాయి.
స్వామివారికి భక్తులు కానుకులు సమర్పించడానికి ఆలయంలో ప్రత్యేకంగా హుండీని ఏర్పాటు చేసింది టిటిడి. గతంలో శ్రీవారి హుండీ ప్రతిరోజూ రెండు సార్లు మాత్రమే నిండేది. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో.. రోజూ 8 నుంచి 16 సార్లు హుండీ నిండిపోతోంది.
కానుకలును ఎప్పటికప్పుడు లేక్కించేందుకు టిటిడి ప్రత్యేకంగా పరకామణి వ్యవస్థను ఏర్పాటు చేసింది. టీటీడీకి ప్రధాన ఆదాయంగా ఉన్న హుండీ కానుకలు లెక్కించకపోవడంతో.. నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో వడ్డీ ఆదాయం నష్టపోతోంది టీటీడీ.
ఉద్యోగులైతే పరకామణి విధులంటేనే హడలిపోతున్నారు. ఒకసారి వచ్చినవారు మరోసారి రావడం లేదు. తాగునీటి వసతి లేకపోవడం, దుమ్ముధూళి ఉండటం, ఒకసారి వెళ్తే మూడు గంటల వరకు ఫిక్సైపోవాల్సి రావడంతో ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో విద్యార్థుల్ని ఉపయోగించుకోవాలనే ఆలోచన కూడా చేస్తోంది టీటీడీ.