తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయ లలిత మృతిపై నెలకొన్న మిస్టరీ మరింత జటిలమయ్యేలా కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. జయ మరణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ఎదుట మార్చి 6న డ్రైవర్ కన్నన్ ఇచ్చిన వాంగ్మూలంలోని సంచలనాత్మక వివరాలను ఓ ఆంగ్లపత్రిక బహిర్గతం చేసింది. కన్నన్ ఇచ్చిన వాంగ్మూలానికి, శశికళ చెప్పిన దానికి ఏమాత్రం పొంతన లేకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తోంది. సెప్టెంబరు 22, 2016న జయలలిత మంచం మీది నుంచి అకస్మాత్తుగా కిందపడిపోయారని, జయ వ్యక్తిగత భద్రతాధికారి వీరపెరుమాళ్‌ను పిలిపించి చక్రాల కుర్చీలోకి మార్చాలని ప్రయత్నించామని, కానీ సాధ్యం కాలేదని శశికళ పేర్కొన్నారు. అయితే, కన్నన్ చెప్పింది ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.
తాను ‘అమ్మ’ జయ గదిలోకి వెళ్లే సరికి కుర్చీలో జయ అచేతన స్థితిలో ఉన్నారని, ఆమె పక్కనే కొన్ని ఫైళ్లు, మూతలేని పెన్ను పడి ఉన్నాయని పేర్కొన్నారు. తనను చూసిన శశికళ వెంటనే ఓ కుర్చీ తీసుకు రమ్మన్నారని కుర్చీ కోసం తాను వెళ్లే లోపే ఆ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్దామన్నారని జయ కుర్చీ పడిపోతున్నట్టు అనిపించడంతో స్ట్రెచర్ తీసుకురావాలని అనుకున్నట్టు చెప్పారు. ‘‘వ్యక్తిగత వైద్యుడు శివకుమార్ రాత్రి 8-30 గంటల వేళ పొయెస్ గార్డెన్లో కనిపించారు. ఆ తరువాత గంటపాటు ఏమయ్యారో ఎక్కడికి వెళ్లారో తెలీదు. మళ్లీ రాత్రి 9-30 తర్వాత కనిపించాడు. జయను తరలించినపుడు ఆయన వెంబడి వెళ్లలేదు. శశికళ, వీరపెరుమాళ్ మాత్రమే వెళ్లారు’’ అని కన్నన్ చెప్పారు. శివకుమార్ ఆ గంటసేపూ ఎక్కడికి వెళ్లారో శశికళ గానీ, ఆయన గానీ వాంగ్మూలాల్లో చెప్పలేదు. అయితే జయలలిత వ్యక్తిగత డ్రైవర్ అయిన కన్నన్ ఇచ్చిన ఈ వాంగ్మూలం జయ మృతి కేసులో కీలకంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.