Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దుర్గగుడి వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. గర్భగుడిలో శుద్ధి పేరుతో మహిషాసురమర్దిని అలంకరణ చేసి పూజలు చేసినట్టు పోలీసు విచారణలో నిందితులు అంగీకరించడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రాత్రి పదిగంటలకు దర్శనం నిలిపివేసి గుడి తలుపులు మూసివేస్తారు. తెల్లవారుజామున తిరిగి శుభ్రపరిచి దర్శనాలకు అనుమతి ఇస్తారు. డిసెంబరు 26వ తేదీ మాత్రం ఇందుకు విరుద్ధంగా జరిగింది. ఆ రోజు అర్ధరాత్రి శాంతిస్వరూపినిగా ఉన్న అమ్మవారిని మహిషాసురమర్ధినిగా అలంకరించి..భైరవీ పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది.
భైరవీ పూజలు వల్ల శక్తులు సిద్ధిస్తాయనే నమ్మకముంది. పూజల అనంతరం అమ్మవారిని మళ్లీ దుర్గామాతగా అలంకరించినట్టు సమాచారం. ఆ సమయంలో గర్భగుడిలో ప్రధాన అర్చకుడు బద్రీనాథ్ బాబుతో పాటు మరో నలుగురు ఉన్నారు. రిజిస్టర్ లో మాత్రం రాత్రి 10.15 తరువాత ఎలాంటి ప్రవేశాలు నమోదుకాలేదు. నిజానికి అంతరాలయంలో రాత్రిపుట్ట శుద్ది కార్యక్రమం దేవాలయ చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడైనా పగటిపూట సుప్రభాత సేవకు ముందు శుద్ధిచేస్తారని, తర్వాత హారతి ఇస్తారని పురోహితులు చెబుతున్నారు. అలాగే అమ్మవారి అలంకరణ ప్రతి గురువారం మారుస్తారు. కానీ మంగళవారం రాత్రి ఇలా జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా…ఈవో సూచనల మేరకే తాము అర్ధరాత్రి పూజలు చేశామని వారు చెప్పారు. ఈ వివాదం నేపథ్యంలో ఆలయ ఈవో సూర్యకుమారిపై వేటుపడింది. ఆమెను ఈవో పదవి నుంచి తొలగిస్తున్నట్టు దేవాదాయ శాఖ ప్రకటించింది.
సింహాచలం దేవస్థానం ఈవోగా ఉన్న రామచంద్ర మోహన్ ను దుర్గగుడి అధికారిగా నియమిస్తున్నట్టు జీవో విడుదల చేసింది. అటు ఈ అంశానికి వైసీపీ రాజకీయరంగు పులుముతోంది. ఆ పార్టీ నేతలు పూజల వ్యవహారాన్ని ప్రభుత్వంతో లంకె పెడుతున్నారు. కుమారుడు లోకేష్ కోసమే చంద్రబాబు కనకదుర్గమ్మ గుడిలో అర్ధరాత్రి క్షుద్రపూజలు చేయించారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. అడ్డంగా దొరికిపోయేసరికి నెపాన్ని అధికారులపై నెడుతున్నారని విమర్శించారు. లోకేష్ ఎప్పుడూ అధికారంలో ఉండాలన్న స్వార్థంతోనే తాంత్రిక పూజలు చేయించారని ఆరోపించారు. మరోవైపు పూజల ప్రచారంపై పీఠాధిపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
దుర్గగుడిలో రెండేళ్లుగా అనేక అపచారాలు జరుగుతున్నాయని, ఇది చాలా దురదృష్టకరమని, దేశానికి అరిష్టమని హెచ్చరించారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగేవిధంగా ఆలయంలో క్షుద్ర, తాంత్రిక పూజలు జరగడం శోచనీయమన్నారు. దేవాలయాల పవిత్రతను కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. హిందూ దేవాలయాల ఆదాయం మీద ఉన్న మక్కువ దేవుడి మీద లేకపోతే ఇలాంటి ఘటనలే జరుగుతాయన్నారు. శారదాపీఠం తరపున ప్రభుత్వానికి లేఖరాస్తున్నామని, త్వరలో పీఠాధిపతుల సమావేశం ఏర్పాటుచేసి, హైకోర్టుకు వెళ్తామని స్వరూపానందస్వామి వెల్లడించారు.