కరోనా వైరస్ ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చైనాను గడగడలాడించిన ఈ మహమ్మారి పొరుగు దేశం భారత్లోకి చొరబడింది. కేరళలో ఇప్పటికే కరోనా కేసులు నమోదు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాపై అప్రమత్తమైంది. ఒకవైపు కరోనాపై కలవరపడుతోన్న ఏపీకి తాజాగా మరో వైరస్ బెంగ పట్టుకుంది. వీవీఎన్డీ అనే వైరస్ సోకడంతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ వైరస్ ధాటికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోళ్ల ఫారాలు మూతబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తణుకులో వారంపాటు చికెన్, మటన్, మాంసం విక్రయాలు బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు.
ఏపీని కొత్త వైరస్ వణికిస్తోంది. మాంసం తినడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందన్న వదంతుల నేపథ్యంలో ఇప్పటికే కుదేలైన పౌల్ట్రీ పరిశ్రమకు తాజాగా వీవీఎన్డీ వైరస్ కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. ఈ వైరస్ ధాటికి కోళ్ల ఫారాలు మూతబడుతున్నాయి. వీవీఎన్డీ వైరస్ సోకిన కోళ్లను ఫారం యజమానులు బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. దీంతో, ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు….వైరస్ సోకిన కోళ్లను పూడ్చివేసి డీకంపోజ్ చేయాలని ఆదేశించారు.
ఈ వైరస్ భయంతో తణుకులో వారంపాటు చికెన్, మటన్ విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించారు. సరైన సమయంలో కోళ్లకు వ్యాక్సిన్ వేయించకపోవడంతోనే ఈ వైరస్ కోళ్లకు సోకిందని అధికారులు చెబుతున్నారు. ఈ వైరస్ను అరికట్టేందుకు వ్యాక్సిన్ ఉందని చెప్పారు. ఈ వైరస్ వార్తతో ఆ రెండు జిల్లాలతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లోనూ మాంసం విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి.