Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బాహుబలి-2 ని సైతం వెనక్కి నెట్టి భారత దేశం తరపున ఆస్కార్ నామినేషన్ కు ఎంపికయింది న్యూటన్ సినిమా. ఇలా ఆస్కార్ నామినేషన్ కోసం వివిధ దేశాల నుంచి పోటీపడుతున్న చిత్రాల సంఖ్య 92. అంటే ఆస్కార్ బరిలో నిలవాలంటే న్యూటన్ 91 చిత్రాలను వెనక్కిపంపాలి. ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ నటించిన కాంబోడియా చిత్రం ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్ సినిమాతో పాటు… ప్రపంచ వ్యాప్తంగా బాగా పేరున్న దిగ్గజ నటుల చిత్రాలు కూడా ఈ పోటీలో ఉన్నాయి.
హైతీ, హోండూరస్, లావో పీపుల్స్ డెమోక్రిటిక్ రిపబ్లిక్, మొజాంబిక్, సెనగల్, సిరియా దేశాలు తొలిసారి ఈ కేటగిరీలో పోటీపడుతున్నాయి. ఎన్నికల కథాంశం నేపథ్యంలో వచ్చిన న్యూటన్ చిత్రం విదేశీ చిత్రాలకు గట్టి పోటీఇచ్చి ఆస్కార్ బరిలో నిలుస్తుందని భావిస్తున్నారు. రాజ్ కుమార్ రావ్ నటించిన న్యూటన్ కు అమిత్. వి. మసుర్కర్ దర్శకత్వం వహించారు. 14 మంది సభ్యుల ఆస్కార్ జ్యూరీ కమిటీ బాహుబలి 2, దంగల్ ను కాదని న్యూటన్ ను 2018 ఆస్కార్ ఎంట్రీకి ఎంపిక చేసింది. ఆస్కార్ నామినేషన్ బరిలో నిలిచే చిత్రాలను 2018 జనవరి 23న ఆస్కార్ కమిటీ వెల్లడించనుంది. మార్చి 4న అవార్డులు బహూకరిస్తారు.