మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చిరంజీవితో నటించాలని, కనీసం చిరంజీవి చిత్రాల్లో కొన్ని నిమిషాలు అయినా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు. అందుకు మెగా ఫ్యామిలీ హీరోలు మినహాయింపు ఏమీ కాదు. చరణ్, పవన్, బన్నీ ఇలా అంతా కూడా చిరు మూవీలో కనిపించారు. ఇప్పుడు మెగా డాటర్ నిహారిక కూడా చిరంజీవి మూవీలో కనిపించేందుకు సిద్దం అయ్యింది. చిరంజీవి 151వ చిత్రం సైరాలో నిహారిక ఒక బోయ అమ్మాయిగా, చిరంజీవి పెంపుడు కూతురుగా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
సైరా చిత్రంలో తనకు ఊరికే ఆఫర్ ఏమీ రాలేదు అని, తాను చాలా ప్రయత్నాలు చేసి, చాలా మందిని బతిమిలాడుకున్న తర్వాత మాత్రమే తనకు అవకాశం వచ్చింది అంటూ నిహారిక తాజాగా చెప్పుకొచ్చింది. ఈమె నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఈ అమ్మడు డాడీ చిత్రంలో నటించాలని చాలా కాలంగా కోరుకుంటున్నాను. అందుకే ఆయన్ను అడిగాను, అందుకు చరణ్‌ను ఒప్పించాల్సి ఉంటుందని చెప్పడంతో చరణ్ అన్న కాళ్లు పట్టుకుని మరీ సైరా చిత్రంలో నటించేందుకు ఛాన్స్ దక్కించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. చరణ్ అన్న మొదట నో చెప్పడంతో ఆయన్ను బతిమిలాడి మరీ సైరాలో స్ధానం దక్కించుకున్నాను అని, డాడితో కలిసి నటించేందుకు చాలా ఎదురు చూశాను, ఇప్పటికి సైరాతో ఆ కోరిక తీరబోతుందని నిహారిక ఆనందంగా చెప్పుకొచ్చింది. సైరా చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.