Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సరిహద్దు ప్రాంతాల్లో పహారా కాసే సైనికులను, భద్రతాధికారులను రక్షణ మంత్రులు తరచుగా కలుసుకుని భద్రతను సమీక్షిస్తుంటారు. వారి క్షేమసమాచారాలు తెలుసుకుంటూ ఉంటారు. ఆ సందర్భంగా రక్షణమంత్రిని జవాన్లు, అధికారులు సర్ అని సంభోదిస్తూ… సమాచారం అందిస్తారు. భారత రక్షణమంత్రిగా ఎప్పుడూ విధులు నిర్వర్తించేది పురుషులే కాబట్టి సర్ అన్న పిలుపు సూటవుతుంది. కానీ ఈ సారి దేశ రక్షణమంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. ఓ మహిళ పూర్తిస్థాయిలో దేశరక్షణమంత్రిగా పనిచేయడం ఇదే తొలిసారి. గతంలో ఇందిరాగాంధీ రక్షణమంత్రిగా విధులు నిర్వర్తించినప్పటికీ… ఆమె తాత్కాలికంగానే ఆ బాధ్యతలు నిర్వహించారు. కానీ నిర్మలా సీతారామన్ మాత్రం పూర్తిస్థాయి రక్షణమంత్రిగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో ఆమె రెండు నెలలుగా దేశసరిహద్దుల్లో పహారా కాస్తున్న జవాన్లను తరచుగా కలుసుకుని వారితో మాట్లాడి భద్రతను సమీక్షిస్తున్నారు. అయితే ఆమె సరిహద్దుల వద్దకు వస్తున్న ప్రతిసారీ అక్కడి సైనికులకు, అధికారులకు ఓ సమస్య వచ్చిపడుతోంది. నిర్మలా సీతారామన్ ను ఏమని పిలావలన్నది వారికి అర్ధం కావడం లేదు. ఆమెను మేడమ్ అనాలా లేక సర్ అనాలా అన్నది తెలియక సైనికులు గందరగోళానికి గురవుతున్నారు. కొన్ని సార్లు సైనికులు జైహింద్ మేమ్ సాబ్ అంటే మరికొన్ని సార్లు జైహింద్ సర్ అని పిలుస్తున్నారు.
సాధారణంగా ఆర్మీ ఆఫీసర్ భార్యను సైనికులు మేమ్ సాబ్ అని పిలుస్తారు. అయితే రక్షణమంత్రి హోదాలో మహిళ ఉండడంతో ఆమెను కూడా మేమ్ సాబ్ అని కొందరు పిలిచారు. అది సరైనదా కాదా అని మరికొందరు అయోమయానికి గురవుతున్నారు. వారి అవస్థలు గమనించిన నిర్మలా సీతారామన్ తనను, సర్, మేమ్ సాబ్ అనాల్సిన అవసరం లేదని రక్షణమంత్రి అంటే చాలని సైనికులకు సూచించారు. మంత్రిని ఎలా పిలవాలా అని గందరగోళానికి గురవుతున్న జవాన్లకు నిర్మలాసీతారామన్ ఈ సలహా ఇవ్వడం బాగుందని సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.