కరోనా వైరస్‌పై పోరాటంలో తన వంతు సాయంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు హీరో నితిన్ చెరో రూ. 10 లక్షల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి సంక్షేమ నిధికి ప్రకటించిన 10 లక్షల రూపాయలను చెక్ రూపంలో సీఎం కేసీఆర్‌కు నితిన్ అందజేశారు. ఈ మేరకు మంగళవారం కేసీఆర్‌ను నితిన్ ప్రగతి భవన్‌లో కలిశారు. ఆయనకు చెక్‌ను స్వయంగా అందజేశారు. ఈ క్లిష్ట సమయంలో సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి సాయంగా నిలిచేందుకు ముందుకు వచ్చిన నితిన్‌ను కేసీఆర్ ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు.
కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ఇండస్ట్రీ నుంచి విరాళం ప్రకటించిన తొలి వ్యక్తి నితిన్. ఈ ఆర్థిక సాయాన్ని ఆయన ప్రకటించగానే సోషల్ మీడియాలో నితిన్‌పై ప్రశంసల వర్షం మొదలైంది. ఆయనలా మరింత మంది నటీనటులు ముందుకు వచ్చి విరాళాలు అందజేయాలని కోరుతున్నారు. గతంలో మన సినిమా హీరోలు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విరాళాలు అందజేశారు. అలాగే, ఇప్పుడు కూడా తమ మంచి మనసులను చాటుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మరోవైపు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఉన్న పేద నటీనటులను ఆదుకోవాలని డాక్టర్ రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత నిర్ణయించారు. తమ ఫౌండేషన్ ద్వారా వారికి సహాయాన్ని అందజేయనున్నట్టు ప్రకటించారు. అలాగే, తమిళనాడులో సినీ కార్మికులను ఆదుకోవడానికి హీరోలు ముందుకు వస్తున్నారు. ముందుగా హీరో సూర్య, ఆయన తమ్ముడు కార్తి రూ. 10 లక్షలు ప్రకటించారు. ఆ వెంటనే సూపర్ స్టార్ రజినీకాంత్ ఏకంగా రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ చెరో రూ. 10 లక్షల చొప్పున ఇచ్చారు. ఈ మొత్తంతో 15000 మంది సినీ కార్మికులకు నిత్యవసరాలను సరఫరా చేయనున్నారు.