Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వాళ్ల షెడ్యూల్ లో తీరిక అన్న పదానికి చోటుండదు. ప్రభుత్వ పాలనకు సంబంధించిన వ్యవహారాల్లోనే కాదు… వాళ్లు హాజరవ్వాల్సిన కార్యక్రమాల జాబితా కూడా పెద్దదిగానే ఉంటుంది. ఏ పనిచేయాలన్నా… చివరకి పెళ్లి, రిసెప్షన్ వంటి కార్యక్రమాలకు కూడా షెడ్యూల్ ప్రకారమే వెళ్తుంటారు. సాధారణంగా ముఖ్యమంత్రులు వీఐపీలు, వీవీఐపీల పెళ్లిళ్లకు మాత్రమే హాజరవుతుంటారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర పార్టీల నేతలు, జాతీయస్థాయి నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినిమా తారల ఇళ్లల్లో జరిగే వివాహాలకు హాజరై కాసేపు అక్కడ గడిపి వెళ్లిపోతారు. ఒకవేళ వివాహానికి వెళ్లటం కుదరకపోతే… తర్వాత ప్రత్యేకంగా శుభాకాంక్షలు పంపిస్తారు. ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రయినా చేసేది ఇదే. కానీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు.
ఓ సాధారణ కుటుంబానికి చెందిన నవదంపతులకు శుభాకాంక్షలు చెప్పేందుకు ముఖ్యమంత్రి స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. బీహార్ లో వరకట్న వేధింపులకు ఎంతోమంది మహిళలు బలైపోతుండడంతో వాటికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరకట్నం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడాలని అక్టోబరు 2న నితీశ్ కుమార్ రాష్ట్రప్రజలకు పిలుపునిచ్చారు. కట్నం తీసుకోకుండా పెళ్లిచేసుకునేవారే తనను పెళ్లికి పిలవాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. వరకట్నానికి వ్యతిరేకంగా ఓ క్యాంపయిన్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాట్నాకు చెందిన సంజిత్ కుమార్ అనే వ్యక్తి ఇదే ప్రాంతానికి చెందిన జూహి కుమారిని ఈ నెల 19న కట్నం తీసుకోకుండా పెళ్లిచేసుకున్నాడు. కట్నం లేకపోవడంతో పాటు వారిద్దరిదీ మతాంతర వివాహం కూడా. సంజిత్ కుమార్, జూహి పెళ్లి గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి నితీశ్ తీరికలేని షెడ్యూల్ లో కూడా తన పనులన్నీ పక్కన పెట్టి… స్వయంగా సంజిత్ ఇంటికి వెళ్లారు. కొత్త దంపతులకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. కట్నం, మతం గురించి ఆలోచించకుండా ఆదర్శ వివాహం చేసుకున్నందుకు సంజిత్ ను అభినందించారు. ముఖ్యమంత్రి హోదాలో సాధారణ పౌరున్ని ఇంటికి వెళ్లి మరీ అభినందించిన నితీశ్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. వరకట్నదురాచారం రూపుమాపేందుకు నితీశ్ కంకణం కట్టుకున్నారనడానికి ఈ ఘటన నిదర్శనమని పలువురు కొనియాడుతున్నారు. నితీశ్ పిలుపు తర్వాత బీహార్ లోని కొందరు యువకులు కట్నం తీసుకోకుండా వివాహం చేసుకుంటున్నారు. మరికొందరయితే గతంలో తీసుకున్న కట్నాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు.