సడలింపులు లేవ్.. మే 7వరకు లాక్ డౌన్ లోనే : కేసీఆర్

కరోనా మహమ్మారి ఇరు తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దేశమొత్తం మే3వరకు లాక్ డౌన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో కేసీఆర్ కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

అదేమంటే.. ఈ కీలక సమయంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే.. కఠిన నిర్ణయాలు తప్పవని తెలిపింది. ముఖ్యంగా కేబినెట్ నిర్ణయం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదని ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించారు. కేంద్రం కొన్ని సడలింపులు విధించినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

అదేవిధంగా భారత ప్రభుత్వం మే 3వరకు లాక్ డౌన్ పెట్టారని, ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం, వివిధ చానళ్ళు నిర్వహించిన సర్వే ప్రకారం లాక్ డౌన్ పెంచాలని ప్రజలు కోరుకుంటున్నారని కేసీఆర్ తెలిపారు. అందులో భాగంగానే కేబినేట్ నిర్వహించి అందులో తాము సుదీర్ఘంగా చర్చించి లాక్ డౌన్ ను మరో నాలుగు రోజులు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ వివరించారు. అంతేకాకుండా ఆన్ లైన్ ద్వారా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ను అనుమతించబోమని తెలిపారు. ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్ ద్వారా కరోనా వ్యాపించడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఇలాంటి ఇబ్బందులు తెలంగాణలో రాకూడదని.. రేపటి నుంచే ఆన్లైన్ ద్వారా ఫుడ్ డెలివరీ చేసే సంస్థలను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి స్విగ్గి, జొమాటో ద్వారా ఫుడ్ డెలివరీ ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు స్విగ్గి, జొమాటోలు సర్వీసులు బంద్ చేయాలనీ కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ నిబంధనలు పాటించాల్సిందేనని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

కాగా రాష్ట్రంలో ఈరోజు 18 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేసీఆర్ అన్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 858 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే.. ఇంతవరకు తెలంగాణలో 21 మంది కరోనాతో మరణించారని కేసీఆర్ వివరించారు. అయితే తెలంగాణలోని వరంగల్ రూరల్, యాదాద్రి, సిద్ధిపేట, వనపర్తిలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని కేసీఆర్ తెలిపారు.