Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హరికేన్ ఇర్మా బలహీనపడి సాధారణ తుఫానుగా మారింది. అయితే బలహీన పడినా పెనుముప్పు పొంచే ఉందని అమెరికా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇర్మా ఉత్తర ఫ్లోరిడా, దక్షిణ జార్జియా వైపుగా ముందుకు కదులుతూ మరింత బలహీనపడి అలబామా, మిసిసిపీ, టెన్నెసీలవైపు కదులుతోంది. ఇది అల్పపీడనంగా మారనుంది. తీరాన్ని పూర్తిగా దాటే కొద్దీ సముద్ర తీరాన్ని భారీ అలలు ముంచెత్తుతాయని, తీరప్రాంత వాసులుజాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం తుఫాన్ తీవ్రత తగ్గినా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ఉత్తర ఫ్లోరిడా , జార్జియాలో రానున్నరెండురోజుల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరికలుజారీ చేశారు. అటు హరికేన్ ధాటికి ఫ్లోరిడా అతలాకుతలం అయింది. గంటకు 210 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. 3 కోట్ల 60 లక్షల మంది ఇర్మా ప్రభావానికి గురయ్యారు. 45 లక్షల నివాస గృహాలు , వ్యాపార దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో ఫ్లోరిడాలో గాఢాంధకారం నెలకొంది. విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు కొన్ని వారాలు పడుతుందని భావిస్తున్నారు.
ఓర్లాండ్లో నగర శివార్లలోకి వరదనీరు ప్రవేశించింది. మియామి, ఫోర్ట్ లారా తదితర ప్రాంతాల్లో ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇర్మా ప్రభావం ఇంత భయంకరంగా ఉంటుందని అసలు భావించలేదని, తమ జీవితంలో ఇలాంటి భారీ తుఫాన్‌ను ఇప్పటిదాకా చూడలేదని ప్రవాస భారతీయులు అంటున్నారు. ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్న వారిని ఇంకా బయటికి అనుమతించటం లేదు. ఇర్మా శాంతించినప్పటికీ రోడ్లు, విద్యుత్, మంచినీరువంటి మౌలిక వసతులు కల్పించిన తర్వాతే వారిని బయటకు పంపుతామని అధికారులు తెలిపారు. అటు అట్లాంటా, జార్జియాలోని భారత అమెరికన్ సంస్థలు ఇర్మా బాధితులను ఆదుకునేందుకు సహాయకచర్యల్లో పాల్గొంటున్నాయి.
మరిన్ని వార్తలు: