Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అంతర్జాతీయ ఒత్తిళ్లు, అమెరికా హెచ్చరికలను ఉత్తరకొరియా ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. అమెరికా భూభాగం గువాన్ పై అణ్వస్త్ర దాడిచేస్తామని హెచ్చరించి ఆ పై వెనక్కి తగ్గిన ఉత్తర కొరియా కవ్వింపు చర్యలను మాత్రం ఆపటం లేదు. వరుసగా క్షిపణి ప్రయోగాలతో శత్రుదేశాలను రెచ్చగొడుతున్న ఉత్తర కొరియా తాజాగా అణుపరీక్ష నిర్వహించింది. జపాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. అణుపరీక్షతో ఉత్తరకొరియాలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై ఈ తీవ్రత 6.3గా నమోదయింది. ఇప్పటిదాకా ఆ దేశం నిర్వహించిన ఆరు అణుపరీక్షల్లో ఇదే అత్యంత శక్తివంతమైనదని జపాన్ తెలిపింది.
గత మంగళవారం జపాన్ మీదుగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా ఇప్పుడు అణుపరీక్షనిర్వహించి ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తోంది. అమెరికాపై వీలుచిక్కినప్పుడల్లా కయ్యానికి కాలుదువ్వుతున్న ఆ దేశం మరో సంచలన ప్రకటన కూడా చేసింది. సైనిక చర్యకు దిగుతామంటూ అమెరికా చేస్తున్న హెచ్చరికలకు ఘాటుగా బదులిచ్చింది. అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేశామని ప్రకటించింది. ఈ బాంబును జులైలో జపాన్ మీదుగా పసిఫిక్ తీర దిశగా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి హస్వాంగ్ -14కు అమర్చేందుకు వీలుగా తయారుచేశామని తెలిపింది. హైడ్రోజన్ బాంబును 10కిలోల టన్నుల నుంచి 100 కిలోల టన్నుల వరకు ఎంత మోతాదులో కావాలంటే అంత మోతాదులోప్రయోగించవచ్చని తెలిపింది. మిగిలిన బాంబులతో పోల్చితే అత్యధిక ఎత్తులో హైడ్రోజన్ బాంబును పేల్చవచ్చని, దీని ద్వారా జరిగే వినాశనం కనీవినీ రీతిలో ఉంటుందని హెచ్చరించింది.
దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేశామని, బాంబు తయారీలో ఉపయోగించిన గుండుసూదికూడా ఉత్తరకొరియా తయారుచేసిందే అని ఆ దేశం తెలిపింది. కిమ్ జుంగ్ ఉన్ తాత కిమ్ 2 సంగ్ ఏర్పాటు చేసిన జూచే బేసిస్ లో దేశీయ టెక్నాలజీతో హైడ్రోజన్ బాంబు తయారు చేశామని తెలిపింది. ప్రయోగించటానికిసిద్దంగా ఉన్న హైడ్రోజన్బాంబును కిమ్ జుంగ్ ఉన్ పరిశీలిస్తున్న ఫొటో ఒకటి ఉత్తరకొరియా విడుదల చేసింది. ఈ ఫొటో విడుదలయిన కొన్ని గంటల్లోపే ఆ దేశం అణుపరీక్ష జరపటం గమనార్హం. హైడ్రోజన్ బాంబుతో అణుక్షిపణి అమెరికా చేరుకోగలదని నిపుణులు భావిస్తున్నారు. ఉత్తర కొరియా చర్యలపై అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
మరిన్ని వార్తలు: