తెలంగాణ అసెంబ్లీ ఎన్నిలు సమీపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. బీఆర్‌ఎస్ ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ కూడా అభ్యర్థుల లిస్ట్ రెడీ చేస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రచారం కూడా క్రమంగా పెరుగుతోంది. 2014 నుంచి ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభించాయి.
ఉద్యమ పార్టీగా..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)ని స్థాపించారు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 13 ఏళ్ల పోరాటం ఫలించి తెలంగాణ కల సాకారం అయింది. దీంతో 2014 నుంచి టీఆర్‌ఎస్‌ను ఫక్తు రాజకీయ పార్టీగా మార్చేశారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో తమది ఉద్యమ పార్టీ అని ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను కూడా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ ఓట్లు అడిగారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్ల హామీలు టీఆర్‌ఎస్‌ను గెలిపించాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక టీడీపీని ఆంధ్రా పార్టీగా చూశారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఈసారి కూడా అనేక హామీలు ఇచ్చారు. నిరుద్యోగ భృతి, పంట రుణాల మాఫీ, పింఛన్ల పెంపు, రైతుబంధు, ఇంటింటికీ తాగునీరు. రైతులకు ఉచితంగా ఎరువులు వంటి హామీలు ఇచ్చారు. ఇదే సమయంలో కలిసి పోటీ చేసిన టీడీపీ, కాంగ్రెస్‌ను టార్గెట్ చేసి తెలంగాణకు ఆంధ్రా పాలకులు అవసరమా అని ప్రచారం చేశారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తెలంగాణను ఆంధ్రాలో కలుపుతారని బెదిరించారు. దీంతో ఈసారి కూడా ప్రజలు టీఆర్‌ఎస్‌వైపే మొగ్గు చూపారు.
ప్రధాని పీటంపై కన్ను..
ఈ క్రమంలో పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు ప్రధాని పీటంపై కన్ను పడింది. రెండుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోదీ ప్రధాని అయినట్లు తాను కూడా తెలంగాణ మోడల్‌ను దేశానికి చూపి పీఎం కావాలనుకున్నారు. ఈ క్రమంలో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా పేరు మార్చారు. ఢిల్లీలో ఆఫీస్ పెట్టారు. మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
వీడియో వైరల్..
ఈ నేపథ్యంలో తాజాగా టీఆర్‌ఎస్ ఎలా ఏర్పడింది… బీఆర్‌ఎస్‌గా ఎలా మారింది. తెలంగాణ ఉద్యమకారుల స్థానం ఉద్యమ పార్టీలో ఎక్కడుంది అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ ఓ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇందుకు కారణం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇచ్చిందని బీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తరచూ ఆరోపిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్ పుట్టుకపైనే వీడియో తీశారు. 1999లో చంద్రబాబు కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే టీఆర్‌ఎస్(తెలుగు దేశం రాష్ట్ర సమితి) ఏర్పడిందని.. తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాక టీడీపీ ఎమ్మెల్యేలను పూర్తిగా టీఆర్‌ఎస్‌లో చేరుకున్నారని, ఉద్యమకారులను పక్కన పెట్టి టీడీపీ నేతలకు పెద్ద పీట వేశారు. 2018లో మళ్లీ అధికారంలోకి వచ్చాక కూడా టీఆర్‌ఎస్(తెలుగు దేశం రాష్ట్ర సమితి)ని బీఆర్‌ఎస్(బాబు రావు రాష్ట్ర సమితి)గా మార్చారని ఈ వీడియో ద్వారా వివరించారు. ప్రస్తుతం కేసీఆర్ టీడీపీ నుంచి వచ్చిన వారికి కండువాలు కప్పుతున్నది, మంత్రి పదువులు ఇచ్చిన ఫొటోలు ఈ వీడియోలో ఉన్నాయి. ప్రస్తుతం 88 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే.. అందులో 42 మంది టీడీపీ నుంచి వచ్చిన వారే. 18 మంది మంత్రులు ఉంటే.. టీడీపీ నుంచి వచ్చిన వారే 11 మంది ఉన్నారు. ఇలా టీఆర్‌ఎస్ కాస్త.. తెలుగు దేశం రాష్ట్ర సమితి, బాబు.. రావు.. రాష్ట్ర సమితిగా మారిందని వీడియో ద్వారా వివరించారు.