డ్రగ్స్ వినియోగంపై బేబీ సినిమా నిర్మాతకు నోటీసులు అందిస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆ చిత్రంలో డ్రగ్స్ ఏ విధంగా వినియోగించాలో తెలిపే దృశ్యాలను చూపించారని ఆక్షేపించారు. డ్రగ్స్ తీసుకునే దృశ్యాలను తీయవద్దని చిత్ర రంగానికి సీపీ విజ్ఞప్తి చేశారు. ఓవైపు తాము డ్రగ్స్ కట్టడికి అహర్నిషలు కష్టపడుతుంటే.. మరోవైపు కొందరు సినిమాల్లో విచ్చల విడిగా డ్రగ్స్ వాడకం చూపిస్తున్నారని మండిపడ్డారు. నైతిక బాధ్యత వహిస్తూ.. సినిమాల్లో మత్తుపదార్థాల వినియోగం గురించి చూపించకుండా ఉండే ప్రయత్నం చేయాలని సీపీ కోరారు.
సీవీ ఆనంద్ వ్యాఖ్యలపై బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్ స్పందించారు. కథలో భాగంగా డ్రగ్స్ సన్నివేశం పెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. బేబీ సినిమాలో డ్రగ్స్ సన్నివేశాలకు సంబంధించిన దృశ్యాలు ఉండటంతో పోలీసులు పిలిచి వివరణ అడిగారని తెలిపారు. అలాంటి సన్నివేశాలు మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఆనవాళ్లు బయటకు వచ్చాయని పోలీసులు చెప్పినట్లు సాయి వివరించారు. ప్రజలకు ఆదర్శంగా ఉండేలా సినిమాలు తీయాలని.. తెలుగు సినీ పరిశ్రమ రంగానికి తెలపాలని పోలీసులు కోరినట్లు చెప్పారు .