సీఎం జగన్, వైఎస్ భారతిలకు నోటీసులు వచ్చాయంటూ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పార్టీల పొత్తుపై జన సైనికులని రెచ్చగొట్టే విధంగా చివర అంకె కలిగిన ఒక ఛానల్ తన కార్యక్రమాలను ప్రసారం చేస్తోందని, ఇప్పటికే పొత్తు ఖరారు అయిందని, ఇక వాళ్ళు ప్రయత్నాలు చేసినా ప్రయోజనం నిల్ అని రఘురామకృష్ణ రాజు అన్నారు.
జనసైనికులను మిస్ లీడ్ చేసే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ ధనంతో సాక్షి దినపత్రిక కొనుగోలుపై ఉషోదయ పబ్లికేషన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు సాక్షి దినపత్రిక యజమాని భారతీ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి నోటీసులు జారీ చేసిందని, ఆ నోటీసులు తాడేపల్లి ప్యాలెస్ కు అందినట్లు తెలిసిందని రఘురామకృష్ణ రాజు గారు వెల్లడించారు.
నాసిక్ లో గంగానది జన్మించి పూణే మీదుగా ప్రవహించిందన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి మాటల మాదిరిగానే, స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో ఎటువంటి స్కాం జరగకపోయినప్పటికీ పులివెందుల, కడప బ్యాచ్ ఆయనపై తప్పుడు కేసు నమోదు చేశారని రఘురామకృష్ణ రాజు గారు మండిపడ్డారు. చంద్రబాబు గారిపై తప్పుడు కేసు నమోదు చేయమని ఆదేశించిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అయితే ఆ వంటకాన్ని అద్భుతమైన దినసులతో వండి వార్చిన వ్యక్తి ఏపీసీఐడీ చీఫ్ సంజయ్ అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్ లు ఇద్దరు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని అన్నారు.