Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రముఖ నవలా రచయిత్రి, యద్దనపూడి సులోచనారాణి అమెరికాలోని కాలిఫోర్నియా పరిధిలో ఉన్న కుపర్టినోలో గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 79 సంవత్సరాలు. సులోచనా రాణి మరణించిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. తన జీవిత చరమాంకంలో తన కుమార్తె వద్ద కాలం గడుపుతున్న ఆమె మరణం నవలాలోకానికి తీరని లోటు అనే చెప్పాలి. 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో జన్మించిన ఆమె, మధ్యతరగతి మహిళల ఊహలను, వాస్తవాలను తన నవలల్లో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. 1970వ దశకంలో ప్రతి చదువుకునే స్త్రీ ఇంటా యద్దనపూడి నవల కనీసం ఒకటన్నా నిత్యమూ ఉండేదంటే అతిశయోక్తి కాదు. గత కొన్నేళ్లుగా ఆమె రచనలకు దూరంగా ఉంటున్నారు.
చదువుకునే పిల్లలకు సాయం చేయడం, మానసిక సమస్యలు ఉన్న పిల్లల కోసం ఆమె ఓ పాఠశాల నడుపుతున్నారు. ప్రత్యక్ష్యంగా కాకపోయినా తన రచనలతో కోట్లాది తెలుగు పాఠకులకు ఆమె సుపరిచితురాలే. అగ్నిపూలు, మీనా, విజేత, బహుమతి, బంగారు కలలు, అమరహృదయం, మౌన తరంగాలు, సెక్రటరీ తదితర నవలలు రాశారు. ఇలా ఆమె సుమారు 40 నవలల వరకూ రాశారు. ఆమె రచనలు సినిమాలుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి. సులోచనారాణి సినిమాలకు కూడా కథలను అందించారు. 1965లో మనుషులు – మమతలు సినిమాకు ఆమె కథ అందించారు. సులోచనా రాణి రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు సినిమాలుగా వచ్చాయి.