ప్రతి తెలుగువాడు నందమూరి తారక రామారావు అభినయనానికి అభిమానుడే. మరి అలాంటి వ్యక్తి జీవిత కథ ను తెలుసుకోవాలని ఎప్పటినుండో ఎదురుచూస్తున్న తెలుగు ప్రజానీకానికి ఆరోజు త్వరలోనే రాబోతుంది. నందమూరి తారక రామారావు (సీనియర్ యన్.టి.ఆర్ అనండీ, పెద్ద యన్.టి.ఆర్ అనండీ) జీవిత చరిత్రని ఆయన కుమారుడు మరియు తెలుగు సినిమా సీనియర్ నటుడు అయిన నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మహానాయకుడిగా రెండు భాగాలలో వివరిస్తూ, తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. మొదట ఈ సినిమా తేజ దర్శకత్వంలో మొదలవగా, నా వాళ్ళ కాదంటూ వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బాలకృష్ణ నే ఈ బయోపిక్ కి దర్శకత్వం వహిస్తారు అని ఒక వార్త వచ్చినా, గౌతమపుత్ర శాతకర్ణి సినిమాలో బాలకృష్ణ ని అద్భుతంగా చూపెట్టిన క్రిష్ జాగర్లమూడి ఈ బయోపిక్ కి దర్శకుడిగా ప్రకటన వచ్చేసరికి, నందమూరి అభిమానుల్లో నూతనోత్తేజం వచ్చింది.
అందుకు తగ్గట్టుగానే, ఇప్పటివరకు వదిలిన ఫస్టులుక్ పోస్టర్లలో క్రిష్ పనితనానికి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది.కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విద్యాబాలన్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్ నటీమణులుగా నటిస్తుండగా, సుమంత్, కళ్యాణ్ రామ్, రానా వంటి నటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. వీరే కాకుండా ఇంకొంతమంది నటీమణులు గెస్ట్ అప్పీయరెన్సు కూడా ఇవ్వబోతున్నారు. ఈ సినిమా సిరీస్ లోని మొదటి భాగమైన కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల కాబోతుంది. అయితే, ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని అంగరంగవైభవంగా నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. దీని ప్రకారం, ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక తిరుపతి లో డిసెంబర్ 16 వ తేదీన సినిమా మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో వైభవంగా నిర్వహించనున్నారని సమాచారం.