కొన్ని కథలకు ఒక్క సినిమా సరిపోదు. వాళ్ల జీవితాన్ని చూపించడానికి రెండు గంటలు అస్సలు సరిపోదు. అలాంటప్పుడు చేసేదేం ఉండదు.. రెండు భాగాలుగా చూపించడం తప్ప. “బాహుబలి” విషయంలో రాజమౌళి చేసిందదే. ఈ కథను ఒక్క భాగంలో చెప్పడం కష్టం అని తెలిసి మార్కెట్ పరంగా కూడా వర్కవుట్ చేయడానికి రెండు భాగాలు చేసి సంచలనం సృష్టించాడు.అదే బాటలో దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ ‘ఎన్టీఆర్’ ని తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది. ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ పేరుతో పోస్టర్ ని విడుదల చేసిన చిత్రబృందం తాజాగా రెండో భాగానికి ‘మహానాయకుడు’ అనే టైటిల్ ని పెట్టి బాలకృష్ణ మరో పోస్టర్ ని విడుదల చేశారు. ”అతను కథగా మారితే, ‘కథానాయకుడు’.. అతనే ఓ చరిత్రయితే, ‘మహానాయకుడు’…” అంటూ చిత్రబృందం ట్వీట్ చేస్తూ బయోపిక్ రెండు భాగాలుగా రాబోతుందని కన్ఫర్మ్ చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హంసలదీవి సమీపంలో నిర్వహిస్తున్నారు. బాలకృష్ణతో పాటు కీలక పాత్రధారులంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.అసలు ఎన్టీఆర్ లాంటి మహానాయకుడి జీవితాన్ని రెండున్నర గంటల్లో ఎలా చూపిస్తారు అనే అనుమానాలు ముందు నుంచే ఉన్నాయి. ఇప్పుడు వీటిని నిజం చేస్తూ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు క్రిష్. తొలి భాగంలో “ఎన్టీఆర్” సినిమా జీవితం ఉంటుందని.. చిన్ననాటి నుంచి మొదలుపెట్టి స్టార్‌గా ఎలా మారాడు.. నాయకుడిగా ఎలా వచ్చాడు.. ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అనేదాంతో తొలి భాగం పూర్తవుతుందని తెలుస్తుంది. అందుకే దీనికి “కథానాయకుడు” అనే టైటిల్ పెట్టారు. దీని ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. ఆ తర్వాత ప్రజా జీవితం అంతా రెండో భాగంలో చూపించబోతున్నాడు క్రిష్