ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్…!

NTR Kathanayakudu Movie Review Rating

నటీనటులు : నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్‌, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గబాటి, సుమంత్, ప్రకాష్ రాజ్, నరేష్, మురళీ శర్మ, కైకాల సత్యనారాయణ, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, బ్రహ్మానందం, శ్రియ, డైరెక్టర్ క్రిష్, అవసరాల శ్రీనివాస్, నందమూరి తారక రామారావు(జానకి రామ్ కొడుకు), బిందు చంద్రమౌళి, మండలి బుద్దప్రసాద్ తదితరులు.
దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు : బాలకృష్ణ , సాయి కొర్రపాటి , విష్ణు ఇందూరి
సంగీతం : కీరవాణి
సినిమాటోగ్రఫర్ : జ్ఙానశేఖర్
ఎడిటర్ : రామకృష్ణ

balakrishna-rana-ntr-biopic

ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర తెరకేక్కిస్తున్నానని ఆయన కుమారుడు బాలకృష్ణ ఏ నిమిషాన ప్రకటించారో ఆ క్షణం నుండీ ఆ సినిమా మీద భారీ అంచనాలు నెల కొన్నాయి. తన మితుర్డు వారాహి చలన చిత్రం ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటితో కలిసి తేజ దర్శకుడిగా ఈ సినిమా మొదలు పెట్టాడు బాలయ్య. ఏమియ్యిందో ఏమో గానీ తేజ తప్పుకుని సీన్ లోకి క్రిష్ ఎంటరయ్యాడు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నామని దర్శక నిర్మాతలు ప్రకటించగానే ఆ టైటిల్స్ వినగానే మొదటి భాగం కధానాయకుడు, రెండో భాగం మహా నాయకుడు అని మొదటి భాగం నటుడిగా ఆయన ప్రయాణం, రెండో భాగం నాయకుడిగా ఆయన ప్రయాణం ఉంటుదని ఊహించారు అది నిజమే. ఈరోజు మొదటి భాగం ప్రేకషకుల ముందుకు వచ్చింది. మరి భారీ అంచనాలను ఈ సినిమా అందుకుందో లేదో చూద్దాం.

seniour-ntr
కధ :
1984లో చెన్నైలోని అడ‌యార్ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌లో బ‌స‌వ తారకం (విద్యాబాల‌న్) క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ ఉంటుంది. ఆమెను క‌ల‌వ‌డానికి అక్క‌డికి ఆమె కొడుకు హ‌రికృష్ణ‌(క‌ల్యాణ్ రామ్‌) వ‌స్తాడు. ఆ సమయంలో ఆమె చూపు కూడా మందగించడంతో ఆమె తన భర్త ఎన్టీఆర్ చిన్నప్పటి ఆల్బ‌మ్ చూడ‌టంతో సినిమా మొదలవుతుంది. నంద‌మూరి తార‌క రామారావు(బాల‌కృష్ణ‌) రిజిస్ట్రార్ ఆఫీస్‌ లో సబ్ రిజిస్టర్. అక్క‌డ లంచాలు దైనందిన కార్యక్రమాల్లో భాగామవడం వంటపట్టక అది మానేసి తాను నాటకాలు వేస్తున్నప్పుడు చూసి ఆఫర్ ఇచ్చిన ఎల్వీ ప్రసాద్ దగ్గరకి వెళ్లి సినిమాల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. మ‌ద్రాస్ చేరుకుని ఎల్‌.వి.ప్ర‌సాద్‌ గారిని క‌లుస్తాడు. అక్క‌డి నుంచి ఆయ‌న జీవితంలో సినిమా ఓ భాగంగా ఎలా మారింది. మనదేశం సినిమాలో ఎస్పీ పాత్రతో తెరంగ్రేటం చేసిన ఆయన అగ్ర క‌థానాయ‌కుడిగా ఎలా ఎదిగాడు. ఆ ఎదిగే క్ర‌మంలో ఆయ‌న ఎదుర్కొన్న స‌వాళ్లు. ఆయ‌న‌ నటించిన పాత్ర‌లు. ఇలా అన్నీ తెర మీద చూడాల్సిందే. ఇక్కడ కధ పరంగా మేము దాచడానికి పెద్దగా ఏమీ లేకపోయినా ఈ సినిమా థియేటర్ లో చూస్తేనే పరిపూర్ణం.

ntr-biopic-movie
విశ్లేషణ :
నిజానికి ఎన్టీఆర్ సినీ జీవితం తెరచిన పుస్తకం అందుకే దర్శకుడు దశాబ్దాలుగా జనాలకు తెలిసిన విషయాలే తెర మీద చూపించే ప్రయత్నం చేశాడు క్రిష్. ముఖ్యంగా ఎన్టీఆర్‌ కు ఆయన భార్యతో ఉన్న అనుబంధం ఆమె మాటకు ఎంత విలువ ఇస్తారన్న విషయాలను మనసుకు హత్తుకునేలా చూపించారు. ఇక ఎన్టీఆర్‌ బాల్యానికి సంబంధించిన అంశాల జోలికి పోకుండా డైరెక్ట్‌గా ఆయన సబ్ రిజిస్టార్ గా ఎలా జీవితంతో కథను మొదలుపెట్టాడు అనేప్పటి నుండి చూపించారు. నిజానికి ఎన్టీఆర్ జీవితాన్ని సినిమా రూపంలో తెర‌కెక్కించ‌డం అంటే సాహ‌స‌మే అనాలి. అలాంటి సాహసాన్ని బాల‌కృష్ణ చేశారు. ఆంధ్రులందరికీ చంద్రుడు అనే ఒక గ్రహం చందమామ ఎలా అయ్యిందో తెలీదు కానీ ఆంధ్రులందరికీ ఒక సామాన్య వ్యక్తి అన్నగారు ఎలా అయ్యారో కళ్ళకి కట్టింది ఈ చిత్రం. ఎన్టీఆర్ లాంటి మహానటుడి జీవిత కథను వెండితెర మీద ఆవిష్కరించే బృహత్తర బాధ్యతను తీసుకున్న దర్శకుడు క్రిష్‌, నందమూరి అభిమానులను దృష్టిలో పెట్టుకొని సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటి తరం వారికి ఆయన తెలియకపోవచ్చు. ఆయన ఖ్యాతి గురించి వినడమే కానీ.. కళ్లారా చూసే అదృష్టం వారికి దక్కి ఉండకపోవచ్చు. కానీ అలాంటి వారందరికి ఎన్టీఆర్ కధానాయకుడు ఒక వరం. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తెలుగు సినిమా పరిశ్రమను ఎలా మార్చేశాయనే విషయాన్నీ ఒక మామూలు వ్యక్తి తన కుటుంబంలో ఒక్కడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి తెలుగు ప్రజల కుటుంబంలో ఒక్కడిగా మారేంతవరకు ఆయన ప్రయాణం. ఇలా ప్రతి విషయాన్ని అద్భుతంగా తెర పై ఆవిష్కరించాడు దర్శకుడు క్రిష్. ఏ న‌మ్మ‌కంతో అయితే త‌న‌కు బాల‌య్య ఈ బాధ్య‌త అప్ప‌గించాడో దాన్ని నిజం చేసాడు క్రిష్.

ntr-movie
ఇక నటీనటుల విషయానికి వస్తే బాల‌య్య త‌న తండ్రి పాత్ర‌లో ఒదిగిపోయారు. ముఖ్యంగా ముందు నుంచి ఆస‌క్తి పుట్టించిన దివిసీమ ఎపిసోడ్ లో కన్నీళ్లు తెప్పించారు. ఇక సినిమాలు వద్దనుకుని రైల్వే స్టేష‌న్ లో ఎన్టీఆర్ వెన‌క్కి వెళ్లిపోయే సీన్ చాలా ఎమోష‌న‌ల్ గా ఉంది. ముఖ్యంగా బాలయ్య కృష్ణుడిగా వచ్చే సన్నివేశంలో రోమాలు నిక్కబోడుచుకోకుంటే మనుషులు కాదేమో ? అక్కడక్కడా కథను కాస్త సాగదీసిన ఫీలింగ్‌ కలిగినా కీరావాణి సంగీతం దానిని మరచేలా చేసింది. ఇక పాటలతో పాటు నేపథ్యం సంగీతంతో సన్నివేశాలను ఒక స్థాయికు తీసుకెళ్లారు కీరవాణి. ఇక సాయి మాధవ్‌ బుర్రా రాసిన డైలాగ్స్ మనసుని తాకాయి. జ్ఞానశేఖర్‌ సినిమాటోగ్రఫి సినమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది.
తెలుగు బులెట్ పంచ్ లైన్ : ఒక చరిత్ర మీద పంచ్ లేసె పరిజ్ఞానం మాకు లేదని మా భావన…కానీ ప్రతి ఒక్క తెలుగువాడు చూసి కాలర్ ఎగరేసే సినిమా అని మాత్రం చెప్పగలం.

ntr-biopic-movie-balakrishna
తెలుగు బులెట్ రేటింగ్ : తెలుగు అని పేరు కూడా లేకుండా మదరాసీ అని పిలవబడే ఒకప్పటి మన తెలుగువారికి తమ జాతి గొప్ప‌తనాన్ని, ఆత్మ‌గౌర‌వాన్ని ఎలుగెత్తి చాటిన వ్య‌క్తి జీవిత చరిత్రని భావి త‌రాల‌కు అందించే ఈ బయోపిక్ కి రేటింగ్ ఇవ్వడం అంటే మన మూలాలని మనం అవమానిన్చుకున్నట్టే అని నా వ్యక్తిగత భావన. అందుకే ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వట్లేదు.