Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొదలయింది. నాచారంలోని రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలనం చేసి షూటింగ్ ప్రారంభించారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన దాన వీర శూర కర్ణలో కర్ణుడిని రాజ్యాభిషిక్తుడిని చేసే సీన్ ను ఎన్టీఆర్ సినిమా ముహూర్తపు షాట్ గా చిత్రీకరించారు. 1976లో దాన వీర శూర కర్ణ ప్రారంభోత్సవానికి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్జీ రామచంద్రన్ ప్రత్యేక అతిథిగా వచ్చి క్లాప్ కొట్టగా, ఇప్పుడు ఎంజీఆర్ వేషంలో ఉన్న నటుడు క్లాప్ కొట్టారు. దుర్యోధనుడి వేషంలో బాలకృష్ణ ఓహో రాచరికమా అర్హతను నిర్ణయించునది. సోదరా దుశ్శాసనా… మామా గాంధార సార్వభౌమా, పరిజనులారా… పుణ్యాంగనులారా… అన్న సూపర్ హిట్ డైలాగ్ ను తనదైన స్టయిల్ లో చెప్పారు. కోట శ్రీనివాసరావు ధృతరాష్ట్రుడిగా నటిస్తున్నారు. ముహూర్తపు షాట్ కు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.
ఎన్టీఆర్ షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. స్టూడియోలో ప్రధాన ద్వారం నుంచి చలువ పందిళ్లు ఏర్పాటుచేశారు. శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ భారీ కటౌట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తంచేశారు. సినిమా ప్రారంభోత్సవాలకు సాధారణంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు హాజరుకాబోరని, అయినా ఎన్టీఆర్ పై తనకున్న అభిమానమే తనను ఇక్కడకు రప్పించిందని వెంకయ్య తెలిపారు. చరిత్రను సృష్టించి,దాన్ని తిరగరాసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, అలాంటి వ్యక్తి జీవిత గాథను ఆయన కుమారుడే తెరకెక్కించేందుకు ముందుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ తనది బిజీ షెడ్యూల్ అని, ఇక్కడి నుంచి పూణె వెళ్లి తిరిగి హైదరాబాద్ రావాల్సి ఉందని చెప్పారు. ఇక్కడకు రావడం తనకు ఆనందం కలిగించిందని తెలిపారు. నటనలో, రాజకీయాల్లో రాణించిన రామారావు తనకెంతో నచ్చుతారని, ఇప్పటికీ రాముడు, కృష్ణుడు అంటే ఆయనే గుర్తొస్తారని అన్నారు. అందరూ తెలుగులో మాట్లాడి,తెలుగులో ప్రోత్సహించడం ద్వారానే రామారావుకు నిజమైన నివాళిని తెలిపిన వారవుతామని వెంకయ్య వ్యాఖ్యానించారు.