గతంలో 2015లో జరిగిన బీహార్ ఎన్నికల తర్వాత ఎన్టీవీ తరఫున జరిపే నీల్సన్ కంపెనీ సర్వేలు చేయడం పూర్తిగా నిలిపి వేశామని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి కుమార్తె రచనా చౌదరి డైరెక్షన్ లో ఎన్జీ మైండ్ ఫ్రేమ్ పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ తరఫున చేసే ప్రతి సర్వే రచనా చౌదరి స్వయంగా ఆయా పార్టీలకు మాత్రమే జరుపుతున్నారు. పార్టీ అధినాయకత్వం కోరిన పిమ్మట ఈ సంస్థ ఆయా పార్టీలకు అంతర్గతంగా సర్వేలు నిర్వహించి నివేదికలు అందిస్తుంది.
అయితే రచనా చౌదరి ఆధ్వర్యంలో ఎన్జీ మైండ్ ఫ్రేమ్ నిర్వహించిన సర్వే ఫలితాలు తెలంగాణ ఎన్నికల్లో 99శాతం పక్కాగా వచ్చాయి. అదే అవకాశంగా భావించిన ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పార్టీలు వీరిని సంప్రదించి సర్వేలు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు ఎన్టీవీ డైరెక్షన్ లో జరిపిన ‘ఎన్జీ మైండ్ ఫ్రేమ్’ సర్వే చాలా నిజాయితీగా తేల్చి చెప్పిందని తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత మెచ్చుకున్నారు కూడా. అదే మార్గంలో తర్వాత ఏపీలో టీడీపీ తరఫున సర్వే చేయించేందుకు బాబు ముందుకొచ్చారని వారికి కూడా ఈ సంస్థ చాలా పకడ్బంధీగా సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా ఇదే కంపెనీతో సర్వే చేయించుకొని ఆ విధంగా ఎప్పటికప్పుడు లోపాలను తెలుసుకుంటూ వాటిని అధిగమిస్తూ ముందుకు పోతున్నట్లు సమాచారం అందుతుంది. కానీ ఇప్పుడు ఎన్నికలకు సమయం మూడు రోజులే ఉండటంతో పలు సర్వేలతో కూడిన వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందరి సర్వేలు ఏ పార్టీకి ఎలా ఉందని బహిరంగంగా తెలుపుతున్నా.. ఈ సంస్థ జరిపే సర్వే మాత్రం ఆయా పార్టీ అధనేతలకు మాత్రమే తెలిసేలా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. గతంలో టీఆర్ఎస్ పార్టీకి నిర్వహించిన సర్వే పక్కాగా రావడంతో ఇదే ఆశతో అధికారంలోకి వచ్చేలా చంద్రబాబు కూడా ఇదే సంస్థతో సర్వే చేయించుకోవడం మరో విశేషం.
అందుకు తగినట్లుగానే ఏపీలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చాలా పోటీపోటీగా ఉన్నాయి. ఏపీలో ముఖ్యంగా టీడీపీ.. వైసీపీల మధ్య పోటీ చాలా తీవ్రస్థాయిలో నెలకొని ఉంది. ఇటువంటి సమయంలో ఏపీలో ‘ఎన్జీ మైండ్ ఫ్రేమ్’ జరిపిన సర్వేపై అందరికీ భారీ అంచనాలు.. అత్యంత ఆసక్తి నెలకొంది. ఈ సంస్థ సర్వే బయటకు వెల్లడికాకపోవడంతో అటు నేతలకు ఇటు ప్రజలకు.. ‘ఎన్జీ మైంఢ్ ఫ్రేమ్’ సర్వేపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. మరి ఇలాంటి సమయంలో ముఖ్యంగా ఏపీకి చెందిన ఈ ఎన్నికల హోరాహోరీ పోరుపై ఎవరి సర్వేలో ఎంత నిజముందో తెలుసుకోవాలంటే పోలింగ్ ఫలితాలు వచ్చేంత వరకు ఆగాల్సిందే.