తెలంగాణ మోడల్‌స్కూళ్ల సొసైటీ ఆధ్వర్యంలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ప్రతి ఏటా ప్రవేశాల సంఖ్య పెరుగుతున్నది. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కూడా మోడల్స్కూళ్లలో ప్రవేశాలు పొందేందుకు పోటీపడుతుండటం విశేషం. 2015-16 విద్యా సంవత్సరంలో 69,233 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా.. 2018-19లో ఈ సంఖ్య 95,242కు పెరిగింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూన్ 30 నాటికి 91,635 ప్రవేశాలు నమోదయ్యాయి. ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి వీటి సంఖ్య 96వేలు దాటే అవకాశం ఉన్నదని మోడల్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఏ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నదని, ఈ ప్రక్రియ ముగియడానికి మరో నెల వరకు గడువు ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లో 194 మోడల్‌స్కూళ్లు కొనసాగుతున్నాయి.
ప్రైవేట్ నుంచి పెరుగుతున్న వలసలు
ఐదేండ్ల నుంచి తెలంగాణ మోడల్స్కూళ్లలో ప్రవేశాలు పొందడానికి గ్రామీణ విద్యార్థులు పోటీపడుతున్నారు. అక్కడ సీట్లు పొందడం కోసం స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి కూడా సిఫారసు లేఖలు మోడల్‌స్కూళ్ల సొసైటీకీ అందుతున్నాయి. మోడల్స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్యాను బోధిస్తున్నారు. బాలికల కోసం ప్రతి మోడల్స్కూల్లో హాస్టల్ సదుపాయం ఏర్పాటుచేశారు. ఒకేషనల్ విద్యను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫారాలు అందజేస్తున్నారు. బాలురకు, హాస్టళ్లలో లేని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలుచేస్తున్నారు. మోడల్‌స్కూళ్ల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 210 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు.
జూనియర్ కాలేజీలకు మంచి స్పందన
పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న మోడల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పొందడానికి ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తున్నది. పదో తరగతి వరకు ప్రైవేట్‌స్కూళ్లలో చదివిన ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు కూడా ఈ కాలేజీల్లో ప్రవేశాలు పొందడానికి దరఖాస్తు చేస్తున్నట్టు సొసైటీ డైరెక్టర్ తెలిపారు. మోడల్ కాలేజీల్లో జేఈఈ, ఎంసెట్‌తోపాటు నీట్ పరీక్షల కోసం కూడా ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్నారు. ఈ కాలేజీల్లో 2015-16 విద్యా సంవత్సరంలో 83,130 ప్రవేశాలు నమోదు కాగా.. 2019-20 జూన్ 2వ తేదీ వరకు 1,25,893 ప్రవేశాలు నమోదయ్యాయి. ప్రవేశాలకు మరో నెలరోజుల సమయం ఉండటంతో ఈ సంఖ్య 1.29 లక్షలకు చేరుకునే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. మొత్తం మోడల్స్కూళ్లలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో కలిపి బాలురు కంటే బాలికల ప్రవేశాలే అధికంగా నమోదయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు బాలురు 56,598 మంది, బాలికలు 69,295 మంది ప్రవేశాలు పొందారు.