బిగ్‌బాస్‌కు 4 కోట్లు ఇవ్వలేదు : నూతన్‌ నాయుడు

Nutan Naidu doesn't give 4 crores to Bigg Boss

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో సెలబ్రెటీలతో పాటు సామాన్యులు కూడా పార్టిసిపెట్‌ చేసే అవకాశం ఈసారి దక్కింది. ముగ్గురు సామాన్యులను బిగ్‌బాస్‌ నిర్వాహకులు తీసుకోవడం జరిగింది. ముగ్గురు సామాన్యుల్లో నూతన్‌ నాయుడు ఒకరు. ఈయన డాక్టర్‌ అని, ఈయనకు బాగా డబ్బు ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఇక నూతన్‌ నాయుడు బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు నిర్వాహకులకు ఏకంగా నాలుగు కోట్ల మేరకు ముట్టజెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆడిషన్స్‌ సమయంలో నూతన్‌ నాయుడు షో నిర్వాహకులతో మాట్లాడుకుని డీల్‌ కుదుర్చుకున్నట్లుగా గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భారీ ఎత్తున ఈ విషయంపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నూతన్‌ నాయుడు క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై మాట్లాడుతూ… తాను నాలుగు కోట్లు ఇచ్చినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, అసలు తాను ఆడిషన్స్‌కు వెళ్లిన సమయంలో షో నిర్వాహకులతో మాట్లాడినది ఏమీ లేదని, వారు చెప్పిందే చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక బిగ్‌బాస్‌కు చెందిన వారు తన ఇంటికి వచ్చారు అని, ఆ సమయంలో వారికి పూల బొకే ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించాను. వారికి బిస్కట్‌ పాకెట్‌ ఇచ్చినా కూడా తీసుకునేందుకు నిరాకరించారు అంటూ నూతన్‌ నాయుడు చెప్పుకొచ్చాడు. తాను నాలుగు కోట్లు ఇచ్చి బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లే అవసరం ఏంటీ అంటూ ప్రశ్నించాడు. బిగ్‌బాస్‌ అంటే భారీ క్రేజ్‌, అందులో రెండు మూడు వారాలు ఉన్నా కూడా భారీ క్రేజ్‌ను దక్కించుకునే అవకాశం ఉంటుంది. అందుకే నూతన్‌ అంత భారీ మొత్తంను పెట్టి ఉంటాడని ఇంకా కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నాలుగు కోట్లు పెట్టిన వ్యక్తిని కేవలం రెండవ వారంలోనే ఎలా బయటకు పంపిస్తారు, కనుక నూతన్‌ నుండి షో నిర్వాహకులు అమౌంట్‌ తీసుకుని ఉండరు అనిపిస్తుంది. అసలు విషయం ఆ పైవాడికే తెలియాలి.