అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించిన బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మంగళవారం లోక్సభలో ఆమోదం పొందిన ఈబీసీ రిజర్వేషన్ బిల్లు, నిన్న రాజ్యసభలోనూ పాస్ అయింది. దీంతో పార్లమెంట్ ఈ రిజర్వేషన్లకు ఆమోదం తెలిపినట్లయింది. అయితే ఆర్థిక పరమైన రిజర్వేషన్లు సరికాదని యూత్ ఫర్ ఈక్వాలిజీ ఆర్గనైజేషన్ ఈరోజు సుప్రీంకోర్టులో పిల్ దాఖల్ చేసింది. ఆర్థిక స్థితిగతులను ఆధారంగా చేసుకుని రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈబీసీ రిజర్వేషన్ బిల్లును చట్టంగా చేయకముందే విచారణ చేపట్టాలని యూత్ ఫర్ ఈక్వాలిటీ ఆర్గనైజేషన్, కౌశల్ కాంత్ మిశ్రాలు క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. రిజర్వేషన్లు 50 శాతం మించడం రాజ్యాంగ విరుద్ధమని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే రిజర్వేషన్లు 59.5 శాతం అవుతాయ్. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 49.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. కాగా, విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తీసుకొచ్చిన 124 వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం తెలిపాయి. అయితే కోర్టు దీని మీద ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారండి.