నటీనటులు: నాగార్జున అక్కినేని, మైరా సరీన్, బేబీ కావ్యా, ఫెరోజ్ అబ్బాసీ, అజయ్ తదితరులు
మ్యూజిక్ : రవి శంకర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: రామ్ గోపాల్ వర్మ
యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబోలో సుమారు 28 ఏళ్ల క్రితం వచ్చిన ‘శివ’ చిత్రం టాలీవుడ్‌లో నేటికీ ఓ ట్రెండ్ సెట్టర్ మూవీ. మళ్లీ ఇన్నేళ్లకు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆఫీసర్’ సినిమా తెరకెక్కింది. నాగార్జున – ఆర్జీవీ క్రేజీ కాంబినేషన్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఆఫీసర్’ చిత్రం భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కర్ణాటకకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ కె.ఎం.ప్రసన్న జీవిత కధ ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ఆఫీసర్’ చిత్రాన్ని రూపొందించారు వర్మ. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కధ
స్టోరీ లైన్ లోకి వెళితే నారాయణ్ పసారి (అన్వర్ ఖాన్) ముంబైలో పేరున్న పోలీస్ ఆఫీసర్. ముంబైలో ఆయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. అండర్‌వరల్డ్‌ను నామరూపాలు లేకుండా చేసిన నారాయణ పసారి ఓ ఫేక్ ఎన్‌కౌంటర్ చేశాడనే కేసు వేస్తారు కొందరు. అతడిపై విచారణ జరిపించాలని కోర్టు నిర్ణయించుకుంటుంది. దీనికోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను సిద్ధం చేస్తుంది. దీనికి చీఫ్‌గా హైదరాబాద్‌కు చెందిన శివాజీ రావు (నాగార్జున)ని నియమిస్తుంది. దీంతో శివాజీ రాబు ముంబైకి వెళ్లి నారాయణ్ పసారిపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఇందులో అతడికి భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అందరూ గొప్ప పోలీస్ అనుకునే పసారి దుర్మార్గుడని నిరూపించాలనుకుంటాడు. పసారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచే క్రమంలో శివాజీరావు సంపాదించిన సాక్ష్యాన్ని పసారి అంతం చేస్తాడు. చివరికి శివాజీ గెలిచాడా ? పసారీని దోషిగా నిలబెట్టాడా ? అతనికీ మాఫియాకి ఉన్న సంబంధం బయటపడిందా అనేదే మిగతా కధ.
విశ్లేషణ
దక్షణాది నుండి ముంబైకి వెళ్లిన పోలీస్ మరొక పోలీస్ చేసే క్రిమినల్ చర్యలకు ఎలా అడ్డుపడ్డాడనేదే ఈ సినిమా. సింపుల్ లైన్‌ను సాగదీసి రెండు గంటల సినిమా చేశాడు వర్మ. కథలో ఈ సీన్ ఇంటరెస్టింగ్ గా ఉందే అనుకునేలోపు గాలి తీసేస్తూ నడిపాడు. ఈ సినిమాకు సౌండ్ ఎఫెక్ట్స్ మాములుగా ఉండవని చిత్రబృందం తెగ ప్రమోట్ చేసింది. కానీ చెప్పుకునే స్థాయిలో సౌండ్ సిస్టమ్ లేదు. సాదాసీదా ఫస్ట్ హాఫ్‌తో ఇంటర్వెల్ పడుతుంది. సెకండ్ హాఫ్‌లో కథనం కూడా పెద్ద ఆసక్తికరంగా ఉండదు. ఇక వర్మ స్టైల్‌లో పెట్టే ఫ్రేమింగుల గురించి మనం మాట్లాడుకోకపోవడమే మంచిది. ఇలాంటి సినిమాలు వర్మ ఇంతకముందు కూడా చేశాడు. కథలో కొత్తదనం.. ఇంటరెస్టింగ్ పాయింట్స్ ఎక్కడా కనిపించవు. ఈ సినిమా చూశాక వర్మ అస్సలు మారలేదని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అదే కెమెరా యాంగిల్స్, స్టంట్స్ చూసి చూసి విసుగొస్తుంది.
వర్మను నమ్మి నాగార్జున ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నటుడిగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఆయనకున్న అనుభవంతో శివాజీరావు పాత్రను రక్తి కట్టించాడు. యాక్షన్ సీన్స్‌లో బాగా నటించాడు. విలన్ పాత్రను బలంగా రాసుకున్నప్పటికీ తెరపై ఆ పాత్ర తేలిపోయింది. అన్వర్ తన పేలవమైన పెర్ఫార్మన్స్‌తో చిక్కు తెప్పించాడు. ఆ పాత్రలో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమున్న ఎ ప్రకాష్ రాజ్ లాంటి నటుడినో తీసుకొని ఉంటే బాగుండేది. మైరా సరీన్ కథకు ప్లస్ కాలేకపోయింది. బేబీ కావ్య తన వయసుకి మించిన ప్రదర్శన చేసింది.
టెక్నికల్‌గా వర్మ మార్క్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కెమెరా వర్క్ ఆయన దగ్గరుండి చేసుకొని ఉంటారు. ప్రతి ఫ్రేమ్‌లో వర్మ పనితనం క్లియర్‌గా కనిపిస్తుంది. సంగీతం, నేపధ్య సంగీతం వర్మ తన పాత సినిమాల నుండే కాపీ చేయించి పెట్టుకున్నట్లుగా ఉంది. ఎడిటింగ్ వర్క్ బాగాలేదు. వర్మ సొంత నిర్మాణం కావడంతో అతి తక్కువ బడ్జెట్‌లో సినిమాను పూర్తి చేసేశారు. గంట 55 నిమిషాల నిడివిలో సినిమాటిక్ అనుభూతిని అందించలేకపోవటం గమనార్హం. పూర్తిస్థాయిలో సీరియస్‌గా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరించటం అనుమానమే.