నిజామాబాద్ జిల్లా బోధన్ కేంద్రంగా జంతువుల కళేబరాల అక్రమ దందా విచ్చల విడిగా కొనసాగుతోంది. జంతువుల ఎముకలతో కల్తీ నూనెలు తయారు చేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గుట్టలుగా పేరుకుపోయిన ఎముకలతో భరించలేని వాసన వస్తుండడంతో .. నిర్వాహకుల అసలు గుట్టు రట్టు అయ్యింది.
జంతు కళేబరాలతో కల్తీ నూనెలు తయారు చేస్తున్నట్లు బయటపడింది. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో ఆయిల్ మాఫియా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ శివారు ప్రాంతంలో పెద్ద ఎత్తున జంతువుల కళేబరాలను అక్రమంగా నిల్వ చేస్తున్నారు.
ఇక్కడి నుంచే మహారాష్ర్టతో పాటు ఇతర ప్రాంతాలకు గుట్టుగా వీటిని తరలిస్తున్నారు. బోధన్ పట్టణానికి కూత వేటు దూరంలోని పంట పొలాల్లో ఇనుప రేకులతో షెడ్డులను ఏర్పాటు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా బయట పాత ఇనుప సామాగ్రి వ్యాపారం చేస్తున్నట్లు సెట్ చేశారు.
గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో విపరీతంగా దుర్వాసన వస్తోంది. తరచూ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. స్థానిక రైతులు వాసన భరించలేకపోతున్నారు. వ్యవసాయం కూడా సరిగా చేయలేని పరిస్థితి. భరించలేని వాసన వస్తుండడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు స్థానికులు.
దీంతో బోధన్ శివారులోనూ రహస్యంగా జంతు కళేబరాలను షెడ్‌లో నిల్వ ఉంచారన్న విషయం వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా ఇక్కడ జంతువుల ఎముకలతో కల్తీ నూనెలను తయారు చేస్తున్నారు. ఆ కల్తీ నూనెలను మార్కెట్‌లోకి అతి తక్కువ ధరకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు నిర్వాహకులు.
పట్టణంలోని చికెన్, మటన్ షాపుల్లోని వెస్టేజ్ పదార్థాలను ఇక్కడకే తీసుకొచ్చి నిల్వ చేస్తున్నారు. ఈ ఎముకలను ఒక పెద్ద మిషన్‌లో వేసి పౌడర్‌గా తయారు చేసి, వాటిని ఆయిల్‌తో పాటు ఇతర మెడిసిన్ రూపంలో వాడుతారనే టాక్ వినిపిస్తోంది. జంతు కళేబరాలు, ఎముకలను నిల్వ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక అధికారుల అండదండలతోనే ఈ అక్రమ దందా కొనసాగుతోందనే ఆరోపణలు బలంగా వస్తున్నాయి. తక్షణమే ఆయిల్ మాఫియా ముఠా సభ్యులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు బోధన్ పట్టణ వాసులు.
మరోవైపు జంతువుల కళేబరాల అక్రమ దందాపై జిల్లా కలెక్టర్ సీరియస్‌గా ఉన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అసలు జంతు కళేబరాలతో ఏం తయారు చేస్తున్నారో తెలుసుకోవాలని కోరారు.