థియేటర్లలో వెండితెరకు ఇక శుభం కార్డు పడనున్నది. ప్రొజెక్టర్, స్క్రీన్లను పక్కకునెట్టి సరికొత్త టెక్నాలజీ దూసుకొస్తున్నది. మనం చూసే సినిమా కండ్లముందే జరుగుతున్నదన్న అనుభూతిని కలిగిస్తూ స్పష్టమైన వర్ణాలు, అత్యద్భుతమైన సౌండ్, మరో ప్రపంచంలో విహరింపచేసే త్రీడీ టెక్నాలజీని సపోర్టుచేసే ఎల్ఈడీ హెచ్డీఆర్ స్క్రీన్లు ఎగ్జిబిటింగ్ మార్కెట్‌ను శాసించనున్నాయి. ఇప్పటికే సామ్సంగ్ ఎగ్జిబిటింగ్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించే రీతిలో సరికొత్త టెక్నాలజీతో బిగ్‌స్క్రీన్లను ప్రవేశపెట్టింది. బెంగళూరులోని ఓ థియేటర్లో వెండితెర, ప్రొజెక్టర్‌ను తొలిగించి బిగ్‌స్క్రీన్‌ను ఏర్పాటుచేశారు.
ఎగ్జిబిట్ రంగంలో విప్లవానికి నాంది
థియేటర్లలో సినిమాను ప్రదర్శించాలం టే వెండితెర, సౌండ్సిస్టమ్, ప్రొజెక్టర్ ఉం డాలి. సాంకేతికత ఎప్పటికప్పుడు మారుతున్నప్పటికీ దశాబ్దాలుగా యాజమాన్యాలు వీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. దానికితోడు గోడల్లో అత్యాధునిక సౌండ్ సిస్టమ్‌ను ఫిక్స్ చేయాల్సిన పరిస్థితి. వీటన్నింటిని తలదన్నేలా ఓనిక్స్ ఏల్ఈడీ బిగ్స్క్రీన్లు తెరపైకి వచ్చాయి.
నాణ్యత, స్పష్టతతో..
సామ్సంగ్ సంస్థ ఓనిక్స్ పేరుతో తీసుకొచ్చిన సరికొత్త ఎల్ఈడీ బిగ్ స్క్రీన్లతో దృశ్యాలను అత్యంత సహజసిద్ధంగా వీక్షించవచ్చు. ఓనిక్స్ ఎల్ఈడీ, ఓనిక్స్ సౌండ్, ఓనిక్స్ వ్యూపేరుతో మూడుశ్రేణు ల్లో బిగ్స్రీన్లను ఆవిష్కరించింది. ఓనిక్స్ వ్యూ 3డీ, 7డీ, 9డీ సినిమాల ప్రదర్శనకు దోహదం చేసే ఎల్ఈడీ స్క్రీన్లు. ఓనిక్స్ సౌండ్ అంటే శబ్దవిప్లవమే. డిజిటల్ డాల్బీ సరౌండ్ సిస్టమ్ మాత్రమే ఇప్పటివరకు అత్యాధునిక ధ్వనివ్యవస్థ. ఓనిక్స్ తీసుకువచ్చింది స్కల్ప్టెడ్ టెక్నాలజీ సౌండ్ సిస్టమ్. ఎల్ఈడీ స్క్రీన్ ముందుభాగంలో అమర్చిన శక్తిమంతమైన స్పీక ర్ల ద్వారా కొత్త ధ్వని అనుభూతులను ఆస్వాదించవచ్చు. ఇక మూడవది ఓనిక్స్ ఎల్ఈడీ బిగ్‌స్క్రీన్.
ఇది అత్యంత హై రెజల్యూషన్‌తో చిత్రాలను ప్రదర్శిస్తుంది. చిత్రంలోని ప్రతి వర్ణం, ప్రతి అణువును పూర్తి స్పష్టతతో ప్రదర్శిస్తుంది. వెండితెర కంటె పదింతలు అధికంగా ఈ స్క్రీన్ ప్రకాశవంతంగా సినిమాను ప్రదర్శిస్తుం ది. బెంగళూరులోని స్వాగత్ థియేటర్ ఓనిక్స్ బిగ్‌స్క్రీన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటివరకు మలేషియా, చైనా దేశాల్లో దర్శనమిచ్చిన బిగ్ ఎల్ఈడీ స్క్రీన్ మొదటిసారి బెంగళూరు వేదికగా భారత్‌లోనూ ఆవిష్కృతమైంది. ఓనిక్స్ టెక్నాలజీని ఆస్వాదించేందుకు ప్రేక్షకులు పోటీపడుతున్నారు. నగరంలోని పలు సినిమా థియేటర్ల యాజమాన్యాలు సైతం బెంగళూరుకు వెళ్లి ఓనిక్స్ టెక్నాలజీపై ఆరాతీస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లోనూ ఓనిక్స్ బిగ్ స్క్రీన్లు సందడి చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
మల్టీపర్పస్ బిజినెస్…
ఓనిక్స్ బిగ్స్రీన్లతో అనేక లాభాలున్నాయి. ప్రొజెక్టర్ వాడకం ఉండకపోవడంతో విద్యుత్తు వినియోగం తగ్గుతుంది. చాలాతక్కువ స్థలంలోనే ఇమిడిపోతుంది. సినిమా థియేటర్ల యాజమాన్యా లకు ఓనిక్స్ బిగ్ స్రీన్స్ వాడుకలోకి వస్తే సినిమాలతోపాటు ఈవెంట్లు, శుభకార్యాలు, సదస్సులు వంటి కార్యక్రమాలు జరుపుకోడానికి అవకాశం ఉంటుంది. ఒక్క ఆడిటోరియంతోనే మల్టీపర్పస్ బిజినెస్‌కు అవకాశం ఉంటుంది.