Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలుపై పోరాటానికి కార్యాచరణ సిద్దమయింది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సంఘాల సమావేశంలో కీలకనిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం చేసే ఏ పోరాటానికైనా మద్దతిస్తామని అఖిల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. దేశాన్ని కదిలించగల అనుభవం, సమర్థత ఉన్న నాయకుడు చంద్రబాబు పోరాటానికి దశ, దిశ నిర్దేశించాలని సూచించాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు ఏకతాటిపై ముందుకువచ్చి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, రాజకీయాలకు అతీతంగా జరిపే పోరాటంలో అందర్నీ భాగస్వామ్యుల్ని చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. శాంతియుత పంథాలో ఉద్యమం నడపాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఏప్రిల్ 2,3 తేదీల్లో ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీల ప్రతినిధుల్ని కలుస్తానని సీఎం వెల్లడించారు. రానున్న పదిరోజుల్లో రాష్ట్ర ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే పోరాటానికి సమాయత్తం చేయాలని నిర్ణయించారు. నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలపాలని అఖిలసంఘాలు సూచించాయి. జపాన్ తరహా నిరసనలు తెలియజేస్తామని ఉద్యోగ సంఘాలు చెప్పాయి. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా వ్యవహరించాలని, శాంతియుతంగా ఉద్యమం నడపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జాతీయస్థాయిలో దాదాపు అన్ని పార్టీలు ఏపీ పోరాటానికి మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. –