Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సంజయ్ లీలా భన్సాలీ డ్రీమ్ ప్రాజెక్టు పద్మావతి ట్రైలర్ రిలీజ్ అయింది. భారీ అంచనాలున్న పద్మావతి ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట మూడు నిమిషాలకు ట్రైలర్ విడుదల చేశారు. కరెక్ట్ గా ఆ సమయానికే ట్రైలర్ విడుదల చేయడానికి ఓ కారణం ఉంది. చిత్తోర్ గఢ్ సామ్రాజ్యం కోసం రాణి పద్మావతి, మహారావల్ రతన్ సింగ్ తో సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ యుద్ధం చేసింది 1303వ సంవత్సరంలో. అందుకే దానికి గుర్తుగా ట్రైలర్ ను 13.03 గంటలకు విడుదలచేశారు.
పద్మావతి పాత్రలో దీపికా పడుకునే చాలా అందంగా కనిపిస్తోంది. రాజ్ పుత్ ల ఖడ్గంలో ఎంత శక్తి ఉంటుందో వారి కంకణంలోనూ అంతే శక్తి ఉంటుందని దీపిక రాజ్ పుత్ ల ధైర్యసాహసాల గురించి చెబుతున్న డైలాగ్ హైలెట్ గా నిలిచింది. అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్ వీర్ సింగ్, మహారావల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. ట్రైలర్ లో ఖిల్జీ క్రూరత్వాన్ని, మహారావల్ రతన్ సింగ్, రాణి పద్మావతి అనుబంధాన్ని , ఖిల్జీ, రతన్ సింగ్ మధ్య జరిగే యుద్ధాన్ని చూపించారు. ఖిల్జీ పాత్రలో రణ్ వీర్ సింగ్ జీవించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. అల్లావుద్దీన్ ఖిల్జీ ఇలాగే ఉండేవాడా అన్న భావన కలుగుతోంది. యుద్ధ సన్నివేశాలు, రాజకోట సెట్టింగులు అద్భతంగా కనిపిస్తున్నాయి. రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన పద్మావతి డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.