Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గూడాచర్యం కేసులో పాకిస్థాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ పై ఆ దేశం మరో కుట్ర పన్నుతోంది. జాదవ్ పై ఉగ్రవాదం, విద్రోహం తదితర కేసులు మోపి విచారణ జరుపుతున్నట్టు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. జాదవ్ పై ఉన్న పలు కేసుల్లో గూడాచర్యం కేసు విచారణ మాత్రమే ముగిసిందని… ఇంకా చాలా కేసులు విచారణ దశల్లో ఉన్నాయని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్టు డాన్ పత్రిక పేర్కొంది. జాదవ్ కేసులో సమాచారం కోసం భారత్ కు చెందిన 13 మంది అధికారులను విచారించేందుకు అవకాశమివ్వాలని భారత్ ను పలుమార్లు కోరినప్పటికీ అంగీకరించలేదని తెలిపింది. అలాగే జాదవ్ కు సంబంధించి నావికాదళానికి చెందిన సర్వీస్ ఫైల్ కావాలని కోరుతోందని, ఆయన పింఛన్ కు సంబంధించిన బ్యాంక్ రికార్డు, ఆయనకు ముబారక్ హుస్సేన్ పటేల్ పేరుతో జారీ అయిన పాస్ పోర్ట్ వివరాలు కావాలని కోరుతోందని డాన్ పత్రిక పేర్కొంది.
ముబారక్ హుస్సేన్ పేరుతో పాస్ పోర్ట్ ఎలా వచ్చింది… ఇది అసలైనదా… నకిలీదా తెలుసుకోవాలని పాక్ అధికారులు కోరుతున్నారని వెల్లడించింది. అలాగే ముంబై, పూణెతో పాటు మహారాష్ట్రలోని పలుప్రాంతాల్లో ఉన్న జాదవ్ ఆస్తుల వివరాలూ వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపింది. జాదవ్ ఇరాన్ నుంచి అక్రమంగా పాకిస్థాన్ లో ప్రవేశించాడని, బలూచిస్థాన్ ప్రావిన్స్ లో పాక్ బలగాలు జాదవ్ ను అరెస్టు చేశాయని ఆ దేశం ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలను భారత్ ఖండిస్తోంది. భారత మాజీ నేవీ అధికారి అయిన జాదవ్ ను ఇరాన్ లో పాక్ బలగాలు కిడ్నాప్ చేసి పాకిస్థాన్ తరలించారని భారత్ వాదిస్తోంది. గూఢచర్యం కేసులో జాదవ్ కు పాక్ మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ భారత్ గత మే నెలలో అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించగా… జాదవ్ కు శిక్ష అమలు నిలిపివేయాలని ఆదేశించింది.