పాకిస్థాన్ బ్యాట్స్మన్ ఆసిఫ్ అలీ కూతురు నూర్ ఫాతిమా క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచింది. స్టేజ్-4 క్యాన్సర్తో బాధపడుతున్న రెండేళ్ళ ఫాతిమాకు అమెరికాలో ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె మృతిచెందినట్లు పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫ్రాంఛైజీ ఇస్లామాబాద్ యునైటెడ్ ట్విటర్లో పేర్కొంది. తన కూతురు క్యాన్సర్తో బాధపడుతోందని ఆమె త్వరగా కోలుకునేందుకు ఆ దేవుడిని ప్రార్థించాలని గత ఏప్రిల్లోనే ఆసీఫ్ ట్విటర్లో అభిమానులను కోరాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జట్టుతో ఆసిఫ్ ఉన్నాడు. ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన ఆఖరి వన్డేలో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. ఐదో వన్డేలో పాక్ 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు వన్డేల సిరిస్ను ఇంగ్లాండ్ 4-0తో కైవసం చేసుకుంది. కూతురి మరణవార్త తెలుసుకున్న ఆసీఫ్ ఇంగ్లాండ్ నుంచి నేరుగా అమెరికా పయనమయ్యాడు. ఫాతిమా మృతిపై పాక్ ప్రజలు, క్రికెట్ అభిమానులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.