Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటోందన్న ప్రధాని మోడీ సంచలన ఆరోపణలపై ఆ దేశం ఘాటుగా స్పందించింది. ఇండియాలో జరుగుతున్న ఎన్నికల గోలలోకి తమ దేశాన్ని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి డాక్టర్ మహ్మద్ ఫైజల్ ట్వీట్ చేశారు. సొంత ఎన్నికల చర్చలోకి పాకిస్థాన్ ను లాగడాన్ని భారత్ మానుకోవాలని ఫైజల్ సూచించారు. కుట్ర ఆరోపణలు కల్పించి చెప్పే బదులు సొంత బలంతో మోడీ గెలిచే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. మోడీ బాధ్యతారాహిత్యంతో కూడిన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైజల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం పాలన్ పూర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ప్రధాని ప్రతిపక్ష కాంగ్రెస్ ను, పాకిస్థాన్ ను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు.
కొంతమంది కాంగ్రెస్ నేతలు పొరుగు దేశ నేతలతో మంతనాలు జరుపుతున్నారని, తనను కించపరిచేలా ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించడానికి ముందు రోజు కూడా ఇలాంటి భేటీ జరిగిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ను గుజరాత్ కు ముఖ్యమంత్రిని చేయాల్సి ఉందని పాక్ సైన్యం మాజీ డైరెక్టర్ జనరల్ సర్దార్ అర్షద్ రషీక్ అభిప్రాయపడడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని మోడీ ప్రశ్నించారు. తనను మణిశంకర్ అయ్యర్ నీచ్ అనడాన్ని కూడా ప్రస్తావించిన మోడీ… ఈ వ్యాఖ్యలు చేసే ముందురోజు… ఆయన ఇంట్లో పాకిస్థానీ నేతలతో కాంగ్రెస్ భేటీ జరిగిందని ఆరోపించారు. ఈ భేటీకి పాక్ హై కమిషనర్, పాకిస్థాన్ మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి, భారత మాజీ ఉపరాష్ట్రపతితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా హాజరయినట్టు, దాదాపు మూడు గంటల పాటు భేటీ సాగినట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయనిచెప్పారు. ఆ తర్వాత రోజే మణిశంకర్ అయ్యర్ తనను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారని, ఇది చాలా సీరియస్ అంశమని , తనకే కాకుండా… గుజరాత్ ప్రజలకు, వెనకబడిన వారికి, పేదలకు కూడా అవమానకరమని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఓ వైపు పాక్ మాజీ అధికారి ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోంటే…మరోవైపు పాక్ కు చెందిన మరికొంతమంది నేతలు మణిశంకర్ అయ్యర్ ఇంట్లో సమావేశం నిర్వహించుకుంటున్నారని, ఇవన్నీ సందేహాలకు తావిచ్చేవి కాదా అని ప్రధాని ప్రశ్నించారు. ఈ భేటీల వెనక అసలు ఉద్దేశమేమిటో ప్రజలకు స్పష్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు. ప్రధాని వ్యాఖ్యలకు కాంగ్రెస్ దీటుగా బదులిచ్చింది. రెండేళ్ల క్రితం మోడీ హఠాత్తుగా పాకిస్థాన్ లో దిగి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట పెళ్లి వేడుకకు ఎందుకు హాజరయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్ దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు.