Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
1993 ముంబై పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి రోజుకో వార్త మీడియాలో షికారుచేస్తోంది. దావూద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, చివరిరోజులను సొంత గడ్డ భారత్ లో వెళ్లదీయాలనుకుంటున్నాడని.. కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపించాయి. దావూద్ ఇప్పటికే భారత ప్రభుత్వాన్ని సంప్రదించాడని, ఇందుకు బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, దావూద్ ను ఈ రూపంలో భారత్ కు రప్పించి తమ ఘనతగా చూపించాలనుకుంటోందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే అరోపించారు కూడా. అయితే ఈ వార్తలు అబద్ధమంటున్నాడు దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీం కస్కర్. ఓ బిల్డర్ ను బెదిరించి రూ. 3కోట్లు డిమాండ్ చేసిన కేసులో కస్కర్ ను థానే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణ లో భాగంగా దావూద్ గురించి ప్రశ్నించినప్పుడు కస్కర్ సోదరుని విషయాలును వెల్లడించాడు. దావూద్ కరాచీలో క్షేమంగా, పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపాడు. మోడీ అధికారంలోకి వచ్చాక దావూద్ పాక్ లో నాలుగు స్థావరాలు మార్చుకున్నట్టు కూడా ఇక్బాల్ కస్కర్ చెప్పాడు. ప్రస్తుతానికి దావూద్ మనసులో ఇండియాకు రావాలన్న ఉద్దేశం లేదని తెలిపాడు.
దావూద్ ను అరెస్ట్ చేయబోమని, ఎటువంటి విచారణ ఉండబోదని భారత్ హామీ ఇచ్చినా.ఆయన ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదని ఇబ్రహీం కస్కర్ చెప్పాడు. ఒకవేళ భారత ప్రభుత్వంతో ఒప్పందానికి వచ్చి.దావూద్ తిరిగి స్వదేశానికి రావాలని భావించినా.పాక్ ఐఎస్ఐ ఇందుకు అనుమతించబోదని ఆయన స్పష్టంచేశాడు. ఐఎస్ఐకు చెందిన ఎన్నో రహస్యాలు దావూద్ కు తెలుసని, అందుకే పాకిస్థాన్ ఆయన్ను ఇండియా పంపే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డాడు. ఇబ్రహీం కస్కర్ వ్యాఖ్యలు గమనిస్తే… దావూద్ భారత్ కు లొంగిపోవాలన్న ఆలోచనలో ఉన్నా.పాకిస్థాన్ దీనికి ఒప్పుకునే అవకాశం లేదని అర్ధమవుతోంది. రెండు, మూడేళ్ల నుంచే.
దావూద్ స్వదేశానికి తిరిగి రావాలనే ఆలోచన చేస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వెల్లడించాడు. 2015లో దావూద్ ను తాను లండన్ లో కలిసానని, గృహనిర్బంధంతో సరిపెడితే…తాను ఇండియాకు వస్తానని దావూద్ తనతో చెప్పినట్టు జెఠ్మలానీ వివరించాడు. 1993 పేలుళ్ల తర్వాత భారత్ ను విడిచి వెళ్లిపోయిన దావూద్ చివరకు పాకిస్థాన్ లో తలదాచుకున్నాడు. పాక్ ప్రభుత్వం ఆయనకు రాచమర్యాదలు కల్పించినట్టు వార్తలొచ్చాయి. పాక్ లో ఉంటున్నా.భారత్ అండర్ వరల్డ్ కార్యకలాపాలన్నీ దావూద్ కనుసన్నల్లోనే సాగుతున్నాయి.ఇండియా నుంచి పారిపోయిన తర్వాత దావూద్ తన నేర సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించాడు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సంపన్న నేరగాళ్లలో దావూద్ రెండోస్థానంలో ఉన్నాడు. లండన్ లోని ఆయన ఆస్తులను ఇటీవలే బ్రిటిష్ ప్రభుత్వం జప్తుచేసింది.