Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానం గత పాలకులకు భిన్నంగా ఉంటోంది. ముఖ్యంగా పాకిస్థాన్ తో ఆయన వ్యవహారశైలి అంతర్జాతీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ట్రంప్ స్వయంగా చెప్పినట్టు నిజంగానే గత పాలకులు పాకిస్థాన్ ను నెత్తిన పెట్టుకునేవారు. ప్రపంచంలో పాకిస్థాన్ కు మిత్రదేశాలు అనగానే ముందు చైనా, తర్వాత అమెరికా పేర్లు గుర్తువచ్చేవి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భారత్ రష్యావైపు మొగ్గుచూపడంతో అమెరికా పాకిస్థాన్ ను చేరదీసింది. చైనా అంత స్పష్టంగా కాకపోయినా… దాదాపుగా అమెరికా కూడా పాకిస్థాన్ ఏం చేసినా మద్దతు పలుకుతూ ఉండేది. పాక్ ను ఆంతరంగిక మిత్ర దేశంగా భావించేంది. ఈ హోదాలో వేల కోట్లు సాయం చేసింది. అయితే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో… భారత్ తో కూడా అమెరికా స్నేహానికి మొగ్గుచూపినప్పటికీ… పాకిస్థాన్ అంటేనే ఎక్కువ ప్రేమాభిమానాలు ప్రదర్శించేది.
అమెరికా, భారత్ మధ్య సంబంధాలు ఎంత బలోపేతమవుతున్నా… పాక్ కు మాత్రం ఆ దేశం దృష్టిలో ప్రాధాన్యం తగ్గేది కాదు. దశాబ్దాల కాలం నుంచి ఒబామా నిన్న మొన్న అధ్యక్షుడిగా దిగిపోయేవరకు ఇదే పరిస్థితి. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. ట్రంప్ పాకిస్థాన్ వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు అమెరికా దగ్గర భారీగా సైనిక సాయం తీసుకుంటున్న పాక్… ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి కనబర్చడం లేదన్నది ట్రంప్ అభిప్రాయం. అఫ్ఘానిస్థాన్ పై మాట్లాడే ప్రతి సందర్భంలోనూ ట్రంప్ పాక్ వైఖరిని తూర్పారబడుతున్నారు. ఇప్పుడు మరింత తీవ్రంగా స్పందించి ఆ దేశానికి సైనికసాయం నిలిపివేయాలనే నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
గత 15 ఏళ్ల నుంచి పాకిస్థాన్ కు తమ దేశం తెలివితక్కువగా నిధులందించిందని, ట్రంప్ అభిప్రాయపడ్డారు. సుమారు 33 బిలియన్ డాలర్లకు పైగా అమెరికా సాయం చేసిందని, కానీ పాక్ మాత్రం తమ దేశాన్ని మోసం చేస్తూ అసత్యాలు చెప్పిందని విమర్శించారు. తమ దేశనేతలను పాక్ అజ్ఞానులు అనుకుంటోందని, పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని, ఇక ఆ దేశపు ఆటలు సాగవని హెచ్చరించారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ట్రంప్ యంత్రాంగం పాక్ కు 255 మిలియన్ డాలర్ల సైనికసహాయాన్ని నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. అటు ట్రంప్ వ్యాఖ్యలపై పాక్ తీవ్రంగా స్పందించింది.
అఫ్ఘానిస్థాన్ లో అమెరికా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికి తమపై విరుచుకుపడుతున్నారని పాక్ ఆరోపించింది. ఈ విషయంపై పాక్ విదేశాంగ కార్యాలయం అమెరికా రాయబారికి సమన్లు పంపినట్టు డాన్ పత్రిక తెలిపింది. పాక్ రక్షణ, సమాచార, విదేశాంగ మంత్రులు కూడా ట్విట్టర్ లో అమెరికాపై విమర్శలు గుప్పించారు. అమెరికాకు సమాధానమిచ్చేందుకు సిద్ధమవుతున్నామని, ప్రపంచానికి నిజాలు తెలిసేలా చేస్తామని చెప్పారు. తమ దేశం అమెరికా కోసం ఎన్నో త్యాగాలు చేసిందని అన్నారు. అమెరికాకు తాము ఉచితంగా భూమి ఇచ్చామని, సైనిక స్థావరాలను, ఇంటెలిజెన్స్ వర్గాలను అమెరికా వాడుకుందని, 16 ఏళ్లగా తమ సాయాన్ని తీసుకుంటూ, తమపై అపనమ్మకాన్ని పెంచుకున్న అమెరికా ఇప్పుడు దూషణలకు దిగుతోందని ఆరోపించారు. పాకిస్థానీలను హత్యలు చేస్తున్న సీమాంతర ఉగ్రవాద స్వర్గధామాలను అమెరికా విస్మరించిందని భారత్ పేరు చెప్పకుండా ఆరోపించారు. మొత్తానికి పాకిస్థాన్ అసలు స్వరూపం తెలుసుకున్న ట్రంప్… ఆ దేశానికి వ్యతిరేకంగా చర్యలు ప్రారంభించడం అంతర్జాతీయ సంబంధాల్లో కీలకమలుపుగా భావిస్తున్నారు.