Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మలాలా యూసఫ్ జాయ్… చిన్న వయస్సులోనే ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పాకిస్థానీ అమ్మాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన ఆమె తరువాత పాకిస్థాన్ వీడి ఇంగ్లండ్ చేరింది. లండన్ ప్రభుత్వం ఆమెకు ఆశ్రయమివ్వడమే కాకుండా ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించింది. అలా మలాలా చాలా ఏళ్లగా లండన్ లోనే నివాసముంటోంది. ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకుంటోంది. అయితే ఇన్నేళ్లలో ఆమె తన వస్త్ర ధారణను ఎప్పుడూ మార్చుకోలేదు. తల చుట్టూ ముసుగు ధరించి, సంప్రదాయ ముస్లిం వస్త్రాల్లోనే ఆమె ఎప్పుడూ కనిపిస్తుంటుంది. ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా.. ఆమె ఇదే తరహా దుస్తుల్లో ఉండేది. బాలికల విద్య కోసం చేసిన పోరాటానికి గుర్తుగా…నోబెల్ బహుమతి అందుకున్న సమయంలోనూ మలాలా సంప్రదాయ ముస్లిం వస్త్రాలనే ధరించింది. అలాంటి మలాలా ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా వేసుకున్న ఓ డ్రెస్ ఫొటో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తూ..పాకిస్థానీల ఆగ్రహానికి గురైంది. ఈ ఫొటోలో మలాలా జీన్స్, జాకెట్ ధరించింది.
మలాలా స్కిన్నీ జీన్స్, బాంబర్ జాకెట్, హై హీల్స్ వేసుకుని నడిచివెళ్తున్నట్టుగా ఉన్న ఈ ఫొటో పాకిస్థాన్ లో వైరల్ గా మారింది. పాకిస్థానీలు మలాలా ఫొటోను షేర్ చేస్తూ అనేక రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి మలాలా మోడ్రన్ డ్రెస్ లో ఉన్నప్పటికీ.. తలకు ముస్లిం సంప్రదాయం ప్రకారం ముసుగు ధరించింది. ఆమె డ్రస్ ఎక్కడా అసభ్యంగా లేదు. అయినా సరే… పాకిస్థానీలు మలాలాపై విరుచుకుపడుతున్నారు. మొదట చూడగానే నటి మియా ఖలీఫా అనుకున్నా..అని ఒకరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తే.. మరొకరు త్వరలోనే పాకిస్థాన్ కు భూకంపంవస్తుంది అని కామెంట్ చేశారు. ఇక ఆ తల మీద వస్త్రం వదిలించుకునే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని, మలాలాకు పిచ్చిపట్టిందని, పాకిస్థాన్ పరువుతీసిందని… ఇలా రకరకాలుగా పాక్ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే ఇతర దేశాల నెటిజన్లు మాత్రం మలాలాకు మద్దతుగా నిలిచారు. పాక్ నెటిజన్లను ఉద్దేశించి మీరు ఇక మారరు… అని అసహనం వ్యక్తంచేశారు. మలాలాకు స్వేచ్ఛగా బతికే హక్కు ఉందని, ఇన్నాళ్లకు ఆమెకు స్వాతంత్ర్యం వచ్చిందని అభిప్రాయపడ్డారు.