Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎట్టకేలకు కథ సుఖాంతం అయింది. కొన్నిరోజులుగా సాగుతున్న చర్చోపచర్చలు ఓ కొలిక్కి వచ్చి ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఒక్కటయ్యాయి. దీంతో జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకెలో తలెత్తిన సంక్షోభం ముగిసిపోయినట్టయింది. రెండు వర్గాలు విలీనమవుతున్నట్టు పన్నీర్ సెల్వం ప్రకటించారు. అన్నాడీఎంకె ప్రధాన కార్యాలయంలో ఇరు వర్గాల భేటీ అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పళనిస్వామి వర్గం, పన్నీర్ వర్గం ఒక్కటయ్యేందుకు కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. విలీనానికి పన్నీర్ సెల్వం కొన్ని షరతులు విధించారు. పార్టీ ప్రధానకార్యదర్శి పదవి నుంచి దినకరన్ ను తొలగించటం, జయలలిత మృతిపై విచారణ జరిపించటం, వేదనిలయాన్ని ప్రభుత్వ స్మారక చిహ్నంగా మార్చటం వంటి షరతులను పన్నీర్ విధించారు.
ముఖ్యమంత్రి పళనిస్వామి మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమై పన్నీర్ షరతులపై పలు దఫాలుగా చర్చించి వాటిని అంగీకరించాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా దినకరన్ ను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించటంతో పాటు శశికళ వర్గానికి చెక్ పెట్టారు. పన్నీర్ కోరుకున్నట్టుగా జయలలిత మృతిపై న్యాయవిచారణకు ఆదేశించారు. వేద నిలయాన్ని ప్రభుత్వ స్మారక చిహ్నంగా మార్చేందుకు ఉత్తర్వులిచ్చారు. తన షరతులన్నింటికీ పళనిస్వామి వర్గం ఒప్పుకోవటంతో విలీనానికి పన్నీర్ మొగ్గుచూపారు. ఈ నిర్ణయంతో జయలలిత మరణం తరువాత బలహీన పడ్డ అన్నాడీఎంకె మళ్లీ పాత బలం పుంజుకుంటుందని రెండు వర్గాలు భావిస్తున్నాయి. అయితే పార్టీలో మూడో వర్గంగా ఉన్న దినకరన్ రాజకీయ కార్యాచరణ ఏమిటన్నది ఇంకా తేలలేదు. అటు తమిళనాడులో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ పన్నీర్, పళని వర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్టు భావిస్తున్నారు. అంతర్గత సర్దుబాట్లు పూర్తయిన తరువాత అన్నాడీఎంకె కేంద్ర మంత్రి వర్గంలో చేరుతుందనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలు: