Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని నాలుగేళ్ల పాటు ఈ మైత్రిని కొనసాగించి ఇటీవలే ఆ బంధానికి ఏపీ సీఎం చంద్రబాబు రాంరాం చెప్పేసిన సంగతి తెలిసిందే. బయటకి వచ్చి తన పార్టీకి చెందిన కేంద్రమంత్రులతో సైతం రాజీనామా చేయించిన ఆయన బీజేపీ పై సమయం చిక్కితే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో రాబోయే ఢిల్లీలో చక్రం తిప్పబోయేది ప్రాంతీయ పార్టీలే నని దానికోసం మొన్న కుమారస్వామి ప్రమాణ స్వీకారంలో సైతం పాల్గొని చర్చలలో నిలిచారు. ఇంత జరిగాక ఇప్పుడు ఏపీ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ను ఆ పదవిలో కొనసాగించడం అనే అంశం ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
బాబు పై మోదీ తరపున అమిత్‌షా రోజుకో విమర్శ చేస్తుంటే, బాబు అయితే నిత్యం మోదీ, అమిత్‌షాపై పరుష పదజాలంతో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలావుంటే, విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో సోమవారం ఉదయం చంద్రబాబు ఆగ్రహంగా కేంద్రంపై, బీజేపీ అధినేత అమిత్‌షాపై నిప్పులు చెరుగుతుంటే పక్కనే ఉన్న పరకాల ప్రభాకర్ క్షణక్షణం కీలకమైన సమాచారంతో చీటీలు అందిస్తూ… రహస్యంగా బాబు చెవి దగ్గర పరకాల కొన్ని విషయాలను కూడా పంచుకున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజుల క్రితం పరకాలను ఆ పదవి నుండి తప్పించారని వార్తలు వచ్చినా ఇవీమీ లేదని తాజా మహానాడు తేల్చేసింది. దీంతో బాబు చాణక్యం ఎవరికీ అర్ధం కాదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి.