పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం లోక్ సభ సమావేశాలు ఆరంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సభ సంతాపం తెలిపింది. దేశానికి ప్రణబ్ సేవలను సభ కొనియాడింది. ఏ పదవిలో ఉన్నా ప్రణబ్ ముఖర్జీ ఆ పదవికి వన్నె తెచ్చారని స్పీకర్ ఓం బిర్లా ప్రశంసించారు. ఇటీవల మృతి చెందిన తమిళనాడు ఎంపీ వసంత్‌కుమార్, పండిత్ జస్రాజ్, అజిత్ జోగి, చేతన్ చౌహాన్ తదితరులకు సభ సంతాపం తెలిపింది. అలాగే కరోనాతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన కరోనా యోధులకు కూడా పార్లమెంట్ నివాళి అర్పిచింది. అనంతరం సభను గంటసేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. అన్ని జాగ్రత్తలతో, కోవిడ్ –19 నిబంధనలను పూర్తిగా పాటిస్తూ, కొత్త విధి, విధానాలతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. కోవిడ్–19 నెగెటివ్ ఉన్నవారికే సభలోనికి అనుమతించడంతో పాటు, మాస్క్ కచ్చితంగా ధరించాలన్న నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఉభయ సభలు తొలిసారి విడతలవారీగా సమావేశం కావడం ఈ సమావేశాల ప్రత్యేకత.
రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది. ఇక విజృంభిస్తున్న కరోనా, కుదేలైన ఆర్థిక వ్యవస్థ, సరిహద్దుల్లో చైనా దుస్సాహసాలు.. తదితర వైఫల్యాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం సిద్ధమవుతోంది.