జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి పోటీ చేస్తున్నారు. అయితే ఆయన ఈరోజు విశాఖ జిల్లా గాజువాకలో నామినేషన్ దాఖలు చేశారు. గురువారం విశాఖ నగరపాలక సంస్థ జోన్-5 కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. పవన్ వెంట జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో పాటూ స్థానిక నేతలు ఉన్నారు. పవన్ నామినేషన్ ర్యాలీకి అభిమానులు భారీగా తరలివచ్చారు. నామినేషన్ అనంతరం గాజువాక, భీమిలి, విశాఖ సౌత్ నియోజకవర్గాల్లో జరగబోయే మూడు ఎన్నికల ప్రచార సభల్లో పవన్ పాల్గొననున్నారు. ముందు పాత గాజువాకలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. తర్వాత ఆనందపురం పూల మార్కెట్ వద్ద సాయంత్రం 5గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని పాత జైలు రోడ్డు వద్ద నిర్వహించే సభలో పాల్గొంటారు. ఇక భీమవరం నుంచి జనసేనాని రేపు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి జనసైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ నామినేషన్ వేసిన అనంతరం ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.