తెలుగు సినిమా రంగంలో అత్యధిక మార్కెట్ వున్న హీరోగా పేరున్న టైమ్‌లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి దిగి పోటీ చేసాడు. రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్లా ఓడిపోయాడు. కారణం ఏదైనా కానీ పవన్ చేసిన తప్పులు లేకపోలేదు. సినీ రంగంలో ఎలాగయితే కొందరికి మాత్రమే తనని కలిసే యాక్సెస్ ఇచ్చేవాడో రాజకీయాల్లోను అదే చేసాడు. అలాగే ఏ అంశాలపై పోరాడాలనే దానిపై క్లారిటీ లేదు. జనం ఏదయితే పెద్దగా పట్టించుకోరో అదే విషయాన్ని పట్టుకుని లాగుతూ వుండేవాడు. ప్రత్యర్థిని ఇరుకున పెట్టాలంటే జనం నాడి పట్టాలి.
వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుని జనం వాణి వినిపించాలి. ఆ విషయంలో పవన్ దారుణంగా ఫెయిలయ్యాడు. రెండు చోట్ల ఓడిన తర్వాత అయినా పవన్ అందరికీ అందుబాటులోకి వస్తాడనుకుంటే అది జరగలేదు. ఇప్పటికీ అలాగే తన క్లోజ్ సర్కిల్‌కి తప్ప దర్శన భాగ్యం ఇవ్వడం లేదు. అలాగే జగన్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ జనాన్ని ఇరిటేట్ చేస్తోంటే ఆ విషయాలని ఎత్తి చూపిస్తూ పోరాడాల్సింది పోయి తెలుగు భాష తరఫున వకాల్తా పుచ్చుకున్నాడు. జనం నాడి తెలిస్తే పవన్ ఈ విషయాన్ని ఇంతగా సాగతీయడు.
ఎవరైనా తమ పిల్లలకి మంచి భవిష్యత్తు వుండే చదువులు చెప్పిస్తామంటే ఎందుకు వద్దంటారు ఇక్కడ భాష చచ్చిపోతోంది అంటూ గగ్గోలు పెట్టడంలో అర్థం లేదు. ఈ పోరాటంలో పవన్‌కి జనం బాసటగా నిలబడరు. మరోవైపు ఎన్నెన్నో తప్పులతో జగన్ ప్రభుత్వం ప్రజలకి ఆగ్రహం తెప్పిస్తోంటే పవన్ మాత్రం తా పట్టిన కుందేటికి మూడే కాళ్లు అంటూనే వున్నాడు.