చంద్రబాబుకు పవన్ తప్పనిసరా?

Pawan Kalyan
Pawan Kalyan

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అన్ని పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ .. ఈసారి ఎలాగైనా పాగా వేయాలని చంద్రబాబు.. జనసేన లేనిదే ప్రభుత్వం ఏర్పడకూడదన్న భావనతో పవన్.. ఇలా ఎవరికి వారు వ్యూహాలు వన్నుతున్నారు. అయితే బలమైన అధికారపక్షాన్ని ఢీకొట్టేందుకు టిడిపి, జనసేన లో పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై క్లారిటీ రావడం లేదు. కనీసం చర్చలు జరిగినట్లు కూడా తెలియడం లేదు. అయితే పొత్తు లేనిదే అధికార వైసీపీని ఓడించడం కష్టమని పరిస్థితులు తెలియజేస్తున్నాయి.

గత కొన్నాళ్లుగా టిడిపి, జనసేన మధ్య పొత్తు వాతావరణం నెలకొంది. రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం కూడా ఉంది. అయితే పొత్తులు రెండు పార్టీలకు అనివార్యం. తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య. అటు జనసేనకు సైతం గెలుపు కీలకం. పార్టీ ఆవిర్భావం నుంచి చెప్పుకోదగ్గ విజయం ఆ పార్టీకి దక్కలేదు. ఈ ఎన్నికల్లో సీట్లు పెంచుకోకుంటే మరింత పలుచన కావడం ఖాయం. రెండోసారి అధికారంలోకి రాకపోతే టిడిపి ఉనికి కూడా ప్రశ్నార్ధకంగా మారనుంది. అందుకే రెండు పార్టీలు పొత్తు కోసం యోచిస్తున్నాయి. కానీ ఆ పొత్తుల్లో తమ పార్టీకి ప్రయోజనాన్ని వెతుక్కుంటున్నాయి. అందుకే పొత్తులు కుదుర్చుకోవడంలో జాప్యం జరుగుతోంది.

పొత్తు ప్రతిపాదన తీసుకొచ్చింది చంద్రబాబే. ముందుగా పావులు కదిపింది ఆయనే. పవన్ సపోర్టు లేనిదే అధికారంలోకి రావడం కష్టమని చంద్రబాబుకు తెలుసు. అందుకే స్నేహస్తాన్ని అందించారు. అయితే మధ్యలో పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానాలు మూడింటిలో విజయం సాధించే సరికి.. పునరాలోచనలో పడ్డారు. కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించారు. జనసేనకు తక్కువ సీట్లు కట్టబెట్టి పొత్తు కుదుర్చుకోవాలని చూశారు. అయితే వారాహి యాత్ర తరువాత సీన్ మారింది. జనసేన గ్రాఫ్ అమాంతం పెరిగింది. కీలక ప్రాంతాల్లో జనసేన ఓట్ షేరింగ్ పెరిగిందని సంకేతాలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడిపోయారు. దీంతో రెండు పార్టీల్లో అంతర్మధనం ప్రారంభమైంది. రెండు పార్టీలకు పొత్తులు అనివార్యంగా దాపురించాయి. రెండు పార్టీల శ్రేణులు సైతం బలంగా కోరుకుంటున్నాయి.