కిడారి హత్యకు పవనే కారణం !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ గురువారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కిడారి సర్వేశ్వర రావు, సోమల మృతికి బాధ్యత వహించాలని జనసేనానిని ఆయన కోరారు. తన తండ్రి చావుకు పవనే కారణం అని, మన్యంలో అశాంతికి ఆయనే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. ప్రశాంతంగా ఉన్న మన్యంలో ఆజ్యం పోసి తన తండ్రి, సోమ మృతికి కారణమయ్యారని ఆరోపించారు. పాడేరు సభలో పవన్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. చంద్రబాబ అధికారంలోకి వచ్చాక బాక్సైట్ తవ్వకాల జీవో నిలిపివేశారన్నారు. తన తండ్రి కూడా బాక్సైట్‌కు వ్యతిరేకంగా గళమెత్తారన్నారు. ఏజెన్సీలో జాబ్‌మేళా, యువతకు శిక్షణ, నిరుద్యోగ భృతితో చంద్రబాబు ఉపాధి కల్పించి యువత పక్కదారి పట్టకుండా చూస్తున్నారని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని కిడారి శ్రవణ్ అన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పవన్ కళ్యాణ్ సభలు పెట్టి గిరిజనులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు బాగా పని చేయాలని, అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు.