Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనవరి 10 న అజ్ఞాతవాసి ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. అసలే సంక్రాంతి సీజన్లో వస్తున్న సినిమా కావడంతో పవన్ ఫ్యాన్స్ అజ్ఞాతవాసి విడుదల వేడుకలకు ఓ రేంజ్ లో ప్రిపేర్ అవుతున్నారు. పవన్ ఫ్లెక్షీ, కటౌట్, పోస్టర్స్ ద్వారా ఆమె అభిమానాన్ని చాటుకోడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఆ పోస్టర్స్ , ఫ్లెక్షీల్లో ఎవరెవరి ఫోటోలు పెట్టాలి, ఏ మ్యాటర్ రాయాలి అని చర్చించుకుంటున్నారు. ఇంతలో సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్న ఓ మెసేజ్ వారిని అయోమయంలో పడేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులని ఉద్దేశించి వచ్చిన ఆ మెసేజ్ లో అజ్ఞాతవాసి రిలీజ్ సందర్భంగా వేసే పోస్టర్స్, ఫ్లెక్షీల్లో వంగవీటి రంగా ఫోటో లేకుండా ఉంటే మంచిదన్న సూచన చేశారు. ఆ ఫోటో వేయడం వల్ల ప్రజారాజ్యం తరహాలో జనసేన మీద కూడా కులముద్ర పడే ప్రమాదం ఉందని ఆ మెసేజ్ లో హెచ్చరించారు. నిజంగా ఈ మెసేజ్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు , జనసేన ఉద్దేశం కూడా అదేనా అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. అయితే పవన్ అభిమానులకు మాత్రం అందులో రాసిన కొన్ని పాయింట్స్ ఆలోచింపచేసేవిగా వున్నాయి. ఇంతకీ ఆ లేఖ ఏమిటో మీరే చదవండి.
ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఈ మెసేజ్ పూర్తిగా చదివి తప్పకుండా షేర్ చేయగలరు. జనవరి 10 వ తారీకున “అజ్ఞాతవాసి” చిత్రం విడుదల కాబోతుంది. అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఫ్లెక్సీలలో రంగాగారి ఫోటోలు మరియు కాపు యువత అని ముద్రించడం వల్ల జనసేన కు చాలా నష్టం జరుగుతుంది. మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులమే కాదు జనసేన కార్యకర్తలం. అలాగే ప్రజారాజ్యం సమయంలో కూడా చిరంజీవి గారికి కులముద్ర వేసి రాజకీయంగా పధకం ప్రకారం చాలా హాని కలిగించారు. కావున ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఫ్లెక్సీలను కానీ ఫేస్బుక్ లో కానీ ఎటువంటి కుల భావన కలిగించే పోస్టులు పెట్టకూడదని తెలియజేస్తున్నాం. అలాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఇటువంటి కత్తి మహేష్ లు రోజుకు ఒకడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారు. జాతి విద్వేషాలు రెచ్చగొడతారు. అలాంటి వారిని తిరిగి మనం పదే పదే విమర్శించడం వాళ్ళ జాతి యావత్తూ జనసేనకు దూరమయ్యే ప్రమాదం వుంది. అందుకని దయచేసి వారిని పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని 2019 ఎన్నికలు లో గెలిపించి మన రాష్ట్రాన్ని ఈ అవినీతి దొంగల నుండి కాపాడుకోవలసిన బాధ్యత మన యువశక్తి పైన ఉంది.
జై జనసేన జై జైజనసేన.