జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ పెట్టి దాదాపు నాలుగేళ్ళు దానికి ఒక్క వ్యక్తినీ ఒక్క పదవిలో నియమించకుండా వచ్చి సరిగ్గా నాలుగో వార్షికోత్సవం రోజున తెలుగుదేశం మీద విమర్శలు మొదలెట్టి ఈ మధ్య కాలంలో బాగా వార్తలలో నిలుస్తున్నారు. ఆయన ఏదైనా రాజకీయ వ్యాఖ్యలు చేసే ముందు అసలు హోం వర్క్ చేయరు అని ఆయన వ్యాఖ్యలు చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది. దీంతో పవన్ కళ్యాణ్ సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో మరికొందరు నేతలతో పోటీ పడుతున్నారనిపిస్తోంది.
గతంలో చాలా సార్లు ట్విట్టర్ ద్వారా ఎన్నో సార్లు సెల్ఫ్ గోల్స్ వేసుకున్నారు. శ్రీ రెడ్డి వ్యవహారం తర్వాత ట్విట్టర్ లో ఎక్కువగా పోస్ట్ లు పెట్టిన పవన్, తాజాగా తాను 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకోవడం దేశ నివ్వేరపరిచేలా చేసింది. తన అభిమానులు కూడా ఏమి సమాధానం చెప్పుకోవాలో అర్ధంకాక ఇబ్బంది పడ్డారు. అలా మొదలు పెట్టిన ఆయన సెల్ఫ్ గోల్స్ ఇటీవలి ఫ్రాన్క్లిన్ టెంపుల్టన్ దాకా కోనసాగాయి. ఇప్పుడు పవన్ చేసిన మరో ఆరోపణ ఆయన పార్టీ మీదా, ఆయన చేసే వ్యాఖ్యల మీదా ఇక నమ్మకమే కోల్పోయే పరిస్థితులు ఏర్పరుస్తున్నాయి. అదేమిటంటే రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే కమీషన్లు ఇచ్చుకోవాలని విదేశాలలో కొంతమంది పారిశ్రామికవేత్తలు తనతో చెప్పారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అయితే ఒక నాయకుడు అనేవాడు పబ్లిక్ గా ఏదన్నా మాట్లాడాలి అంటే దానిపై తగిన హోమ్ వర్క్ చేయాలి… తగిన ఆధారాలు సేకరించాలి… అలాంటిది ఏమీ లేకుండా కేవలం బట్టకాల్చి ఎదుటివాడి మొహం మీద పడేద్దాం అనుకుంటే సదరు నాయకుడు రాజకీయాలలో ఎక్కువ రోజులు నిలబడలేడు. పవన్ ఇప్పుడే కాదు గతంలో లోకేష్ అవినీతి చేశాడంటూ కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేసాడు, తర్వాత రోజు లోకేష్ సవాల్ విసిరితే దానికి స్పందించకుండా ఎవరైనా అవినీతికి రసీదులు ఇస్తారా అంటూ కవర్ చేసుకున్నాడు. మొన్న శ్రీ వారి నగలు దేశం దాటించారని ఒక ఐపీఎస్ చెప్పాడని మరొక ఆరోపణ ఈరోజు ఇలా, పవన్ కి నిబద్ధత ఉంటే ఆ మాట చెప్పిన పారిశ్రామికవేత్త(ల)తో తగిన ఆధారాలతో ఒక ప్రెస్ మీట్ పెట్టించచ్చు, కానీ పవన్ కేవలం ఆరోపణలు చేస్తాడు ఆధారాలు అడిగితే పారిపోతాడు అనే భావన ప్రజల్లోకి వెళితే రేపు పార్టీకి ఎంత నష్టమో ఇప్పుడే రాజీకీయం వంట పట్టించుకుంటున్న పవన్ కి అర్ధం కాకపోవచ్చు.
కియా మోటార్స్ లాంటి ప్రపంచ ప్రతిష్టాత్మక ఆటోమొబైల్ దిగ్గజం సాక్షాత్తూ ప్రధాని కార్యాలయం నుండి మహారాష్ట్ర / గుజరాత్ లో పెట్టమని ఒత్తిళ్ళు వచ్చినా వాటిని కూడా తోసేసారని కేవలం ఆంధ్రప్రభుత్వ సింగిల్ విండో పద్దతులు, ప్రభుత్వ రాయితీలు, అడ్మినిస్ట్రేషన్ నచ్చి ఆంధ్రా లో ఏర్పాటు చేసింది. ఇదొక్కటే కాదు మొన్న పవన్ అన్నట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ కూడా అలా ఏర్పాటయ్యిందే. పవన్ అన్నట్టు కమీషన్లు అడిగితే… వాటిని కట్టి మరీ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయటానికి రారు కదా. ఇలాంటి లాజిక్ లు మిస్సవుతున్న పవన్ కేవలం ఆరోపణలకి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇదే విధంగా ఎన్నికల నాటి వరకు పవన్ వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే జనసేన అనే పార్టీ కనుమరుగు అవడానికి ఎన్నో రోజులు పట్టదు అనేది విశ్లేషకుల వాదన.