రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ టికెట్ లు ప్రకటించిన పవన్ !

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి గెలుపు కోసం కృషి చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ మొద‌టిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న 2019 ఎన్నిక‌ల్లో అన్ని లోక్ స‌భ‌, అసెంబ్లీ స్ధానాల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌, ఎన్నిక‌ల‌కు మ‌రో మూడు నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌టంతో మ‌రింత వేగాన్ని పెంచారు. పార్ల‌మెంట్‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌మిటీలు ఏర్పాటు చేస్తూ పార్టీ సంస్ధాగ‌త నిర్మాణంపై దృష్టి పెట్ట‌డంతో పాటు పార్టీ బ‌లోపేతం కోసం అనేక చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఇత‌ర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేత‌ల‌ను జ‌న‌సేన‌లోకి చేర్చుకోవ‌డంతో పాటు రానున్న ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్దుల‌ను కూడా ఇప్పుడే ఖ‌రారు చేస్తున్నారు ప‌వ‌న్‌. ఇప్ప‌టికే తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ అభ్య‌ర్ధిగా పితాని బాల‌కృష్ణ‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌, తాజాగా మ‌రో ఇద్ద‌రి అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించారు. గుంటూరు జిల్లాలో జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేసే ఇద్ద‌రు అభ్య‌ర్దుల‌ను అధికారికంగా ప్ర‌క‌టించారు. ఆదివారం గుంటూరు జిల్లాలో జ‌రిగిన జ‌నసేన బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ పాల్గొన్నారు.ఈ సంద‌ర్బంగా మాట్లాడిన ప‌వ‌న్‌ వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌పున గుంటూరు ఎంపీగా తోట చంద్ర‌శేఖ‌ర్‌, తెనాలి అసెంబ్లీ అభ్య‌ర్దిగా నాదెండ్ల మ‌నోహ‌ర్ పోటీ చేస్తార‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. అలాగే మాజీ మంత్రి రావెల 2009 నుంచి తనకు తెలిసిన వ్యక్తి అని చెప్పిన పవన్‌ ఆయనకు సీటు ఇస్తామని చెప్పారు కానీ ఎక్కడి నుంచి పోటీ చేయిస్తామన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఈ ముగ్గురు నేతలు కూడా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న వారే కావడం విశేషం.