ఈ నెల 6న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాద‌యాత్ర‌…

Pawan kalyan announced padayatra on National Highway on April 6

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లు కోసం సీపీఐ, సీపీఎం, జ‌న‌సేన ఉద్య‌మ‌కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించాయి. విజ‌య‌వాడ‌లోని జ‌న‌సేన కార్యాల‌యంలో సీపీఐ, సీపీఎం నేత‌లు రామ‌కృష్ణ‌, మ‌ధుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సుదీర్ఘంగా చ‌ర్చించారు. అనంత‌రం ముగ్గురు నేత‌లు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6న ఏపీలో జాతీయ‌ర‌హ‌దారుల‌పై పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని, కేంద్రం ఏపీకి చేసిన, చేస్తోన్న న‌మ్మ‌క‌ద్రోహానికి నిర‌స‌న‌గా ఉద‌యం 10 గంట‌ల నుంచి వూరూరా పాద‌యాత్ర‌లు చేప‌ట్టాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించిన‌ట్టు నేత‌లు తెలిపారు. ప్ర‌జాస్వామ్య దేశంలో పార్ల‌మెంట్ లో అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ చేప‌ట్ట‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని, ఇది ఏపీ ప్రజ‌ల‌కు జ‌రుగుతున్న కుట్ర‌గా భావిస్తున్నామ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు.

కేంద్ర‌ప్ర‌భుత్వ అప్ర‌జాస్వామిక చ‌ర్య‌ల‌కు నిర‌స‌న‌గా 6న పాద‌యాత్ర‌లు చేప‌డ‌తామ‌ని, ప్ర‌ధానంగా జాతీయ ర‌హ‌దారుల‌పైనే ఈ పాద‌యాత్ర జ‌రుగుతుంద‌ని, జాతీయ‌ర‌హ‌దారులు లేని ప్రాంతాల్లో ముఖ్య కూడ‌లిలో పాద‌యాత్ర‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. పూర్తి శాంతియుత ప‌ద్ద‌తిలో జ‌రిగే నిర‌స‌న ఢిల్లీని తాకేలా ఉంటుంద‌ని, సీపీఎం, సీపీఐ, జ‌న‌సేన నాయ‌కుల‌తో పాటు స్థానిక కార్య‌క‌ర్త‌లూ పాద‌యాత్ర‌లో పాల్గొంటార‌ని చెప్పారు. టీడీపీ, వైసీపీలు కేంద్రంపై ఒత్తిడి తేకుండా ప‌ర‌స్ప‌రం నింద‌లు వేసుకుంటున్నాయ‌ని విమ‌ర్శించారు. పాదయాత్ర‌ల అనంత‌రం అనంత‌పురం, ఒంగోలు, విజ‌య‌న‌గ‌రంలో మేధావుల‌తో చ‌ర్చ‌లు, స‌భ‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టాన్ని నిర్వీర్వం చేయ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నామ‌ని, 11 మంది చ‌నిపోవ‌డం, 400 మంది గాయ‌ప‌డ‌డం చాలా బాధ క‌లిగించింద‌ని ప‌వ‌న్ చెప్పారు.

6న జ‌రిగే పాద‌యాత్ర‌లో తాను విజ‌య‌వాడ‌లో పాల్గొంటాన‌ని, ఏ జిల్లా నేత‌లు ఆ జిల్లాలోనే పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలపై పోరాడే క్ర‌మంలో తాము ద‌శ‌ల‌వారీగా ప్ర‌ణాళిక‌లు ప్ర‌క‌టిస్తామ‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ అన్నారు. ఫిబ్ర‌వ‌రి 8న వామ‌ప‌క్ష పార్టీలు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన త‌ర్వాతే ఏపీలోని పార్టీలు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌పై పోరాడ‌డం మొద‌లుపెట్టాయ‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అవిశ్వాస తీర్మానం పెట్టాల‌ని డిమాండ్ చేయ‌క‌పోతే పార్ల‌మెంట్ లో ఇప్పుడు ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టేది కాద‌ని, దేశ‌వ్యాప్తంగా ఇంత చ‌ర్చ జ‌రిగేది కాద‌న్నారు. టీడీపీ, వైసీపీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు దుర్భాష‌లాడుకుంటున్నార‌ని, 5కోట్ల‌మంది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు ప‌క్క‌న‌పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా తాము ర‌హ‌దారుల‌పైకి రాబోతున్నామ‌ని, కేంద్రం స్పందిచాల‌ని సీపీఎం నేత మ‌ధు డిమాండ్ చేశారు. ఉద్య‌మ ప్ర‌ణాళికల‌ను ద‌శ‌లవారీగా ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు.