Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకీ సిద్ధమని జనసేనాని ప్రకటించారు. హైదరాబాద్ లో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేశారు. పక్కా ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళ్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేద్దామని కోరారు. జనసేన పార్టీ ముఖ్య రాజకీయ వ్యూహకర్త దేవ్ ను కార్యకర్తలకు పరిచయం చేశారు. ఎన్నికల సమయంలోనే కాకుండా… ఎన్నికల తర్వాత కూడా దేవ్ సేవలను వినియోగించుకుంటామన్నారు.
జనసేనకు అనుభవం లేదని ప్రత్యర్థులు విమర్శించడం అర్ధరహితమని, జనసేన కార్యకర్తలకు గత రెండు ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ త్వరలో ప్రజల ముందుకు వెళ్తానని, ఈ నెల 11 లోగా పర్యటనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఏ ఊరు నుంచి ఈ యాత్ర ఉంటుందనే విషయాన్ని త్వరలోనే చెబుతానని, ప్రకటించిన 48 గంటల్లోగా ప్రజల మధ్య ఉంటానని పవన్ చెప్పారు. తెలంగాణలో క్యాడర్ బలోపేతంపై దృష్టిపెట్టామని, ఆగస్ట్ రెండో వారం నాటికి తెలంగాణలో పోటీకి సంబంధించి ప్రాథమిక ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు.