పవన్ వద్దకు వచ్చిన వారు అధికారికంగా వచ్చారో, లేక వ్యక్తిగతంగా వచ్చారో ?

వైసీపీ పొత్తుకోసం రాయబారిగా టీఆర్ఎస్ నేతలను పంపిందని జనసేన అధినేత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి పార్థసారథి స్పందించారు. పవన్‌ కల్యాణ్‌ ను వైసీపీతో కలవమని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరో తమకు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్‌కు వైసీపీతో కలిసి పనిచేయాలన్న కోరిక ఉన్నట్లు ఉందని, అందుకే అలా మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరి సహకారం తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. పవన్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మానసికంగా ఓటమికి సిద్దమైనట్లు ఉన్నారని, అందుకనే జగన్‌ చేపడతానన్న పధకాలను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు.

పవన్ వద్దకు వచ్చిన వారు అధికారికంగా వచ్చారో, లేక వ్యక్తిగతంగా వచ్చారో ? - Telugu Bullet

చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని ఎన్నికల స్టంట్ లో భాగంగా చంద్రబాబు అనేక శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు.రాష్ట్రం ఆర్ధికంగా దివాలా తీసే స్థితిలో ఉందని అన్నారు. ఇక జనసేనతో పొత్తుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, దీనికి సంబంధించి టీఆర్ఎస్ నేతలు తనను సంప్రదించారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు కూడా మండిపడ్డారు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ వాళ్లు ఎవరు మాట్లాడారో పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ వద్దకు వచ్చిన వారు అధికారికంగా వచ్చారో, లేక వ్యక్తిగతంగా వచ్చారో చెక్ చేసుకుని మాట్లాడాలని సూచించారు. టీడీపీతో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని పవన్ బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.